Monday, November 18, 2024

NZB: సాగునీరు ఇచ్చి రైతులను ఆదుకోవాలి.. కలెక్టర్ కు వినతి

నిజామాబాద్ ప్రతినిధి, జులై 6(ప్రభ న్యూస్): ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున ప్రభుత్వం రైతులకు సాగునీరిచ్చి ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి కోరారు. శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి మర్యాదపూర్వకంగా కలిసి సాగునీటిపై వినతిపత్రం అందజేసి మాట్లాడారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై చాలా రోజులు అవుతున్నా వర్షాలు కురవక రైతులు వేసినటువంటి వరినార్లు ఎండి పోతున్నాయని వాపోయారు. వరినాట్లు వేద్దామనుకుంటున్న సాగునీరు లేకపోవడం, వర్షాలు కురవకపోవడంతో రైతులు నానా అవస్థలు పడుతున్నారని రైతుల సమస్యలపై జిల్లా కలెక్టర్ తో చర్చించారు.

నిజాంసాగర్ కెనాల్ ద్వారా అలీసాగర్ దిగువన ప్రాంతానికి సుమారు 40వేల ఎకరాలో రైతుల వ్యవసాయం సాగు చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా వరినాట్లు వేసుకోవడానికి సాగునీరందించాలని కోరారు. ఇదివరకే నిజాంసాగర్ పరీవాహక ఎగువ ప్రాంతాలైన బోధన్, బాన్సువాడకు సాగునీరందించి అక్కడి రైతులను ఆదుకోవడం జరిగిందన్నారు.

నిజాంసాగర్ కెనాల్ ద్వారా అలీసాగర్ దిగువన ప్రాంతానికి వరినాట్లు వేసుకోవడానికి సాగునీరందించి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు జగన్ రెడ్డి, రాజన్న, నుడా మాజీ డైరెక్టర్ సంతోష్ సొంతియాగ్, సొసైటీ చైర్మన్ రవీందర్ రెడ్డి, నరేష్, దేవనాయక్, విష్ణు, లక్మన్, ఒడెన్న, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement