నిజామాబాద్ ప్రతినిధి, (ఆంధ్రప్రభ) : ఆహార భద్రత నిబంధనలు పాటించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీమ్ హెడ్ వి.జ్యోతిర్మయి హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాల మేరకు… జ్యోతిర్మయి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు రోహిత్ రెడ్డి, పి.స్వాతితో కూడిన బృందం నిజామాబాద్ నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్ హైస్‌లు, పసుపు తయారీ కేంద్రాలపై ఆకస్మిక దాడులు నిర్వహించింది.
లహరి హోటల్ కు నోటీసులు…
నిజామాబాద్ నగరంలోని దినేశ్వర్ బైపాస్ రోడ్‌లోని లహరి ఇంటర్నేషనల్ రెస్టారెంట్‌పై ఫుడ్ సేఫ్టీ ప్రత్యేక బృందం దాడులు చేసింది. ఆహార భద్రతా ప్రమాణాల ప్రకారం రిఫ్రిజిరేటర్‌లో సరైన ఉష్ణోగ్రతను నిర్వహించడం లేదని, నాన్-ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ కవర్లలో కుళ్ళిన మాంసం ఉత్పత్తులను నిల్వ చేయడంపై అధికారులు మండిపడ్డారు.
అంతేకాకుండా ప్రమాదకరమైన ఫుడ్ కలర్స్ కలిపిన చికెన్, బూజుపట్టిన మసాలా, మిర్చి పేస్టులు, కూర గాయలు గుర్తించిన ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు హోటల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రజల ఆరోగ్యానికి భంగం కలవకూడదని కుళ్లిన మాంసం ఉత్పత్తులను ధ్వంసం చేసి హోటల్ కు నోటీసులు జారీ చేశారు.
వంశి ఇంటర్నేషనల్ హోటల్ కు నోటీసులు జారీ..
వంశీ ఇంటర్నేషనల్ హోటల్‌పై దాడి చేసిన ఫుడ్ సేఫ్టీ ప్రత్యేక బృందం… నిల్వ ఉంచిన మాంసం ఉత్పత్తులు, ఉడకబెట్టిన మిర్చి పేస్ట్, గడువు ముగిసిన మసాలా పొడులను ధ్వంసం చేశారు.
ఆహారం తయారు చేసి నిల్వ ఉంచే వంటశాలలో వెలుతురు సరిగా లేదని.. పూర్తిగా అపరిశుభ్ర వాతావరణంలో ఆహారాన్ని వండి వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని హోటల్ యాజమాన్యంపై అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హోటల్ యాజమాన్యంపై పలువురు ఎఫ్ఎస్ఎస్ఏ నోటీసులు జారీ చేశారు.
మసాలా తయారీ కేంద్రాలపై దాడులు…
మిర్చి కాంపౌండ్‌లోని పలు మసాలా, మిర్చి, పసుపు తయారీ కేంద్రాలపై దాడులు చేశారు. అనుమానాస్పద నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు. మెరుగుదల నోటీసులు, పలు ఆహార భద్రత నోటీసులను జారీ చేశారు.
ఢిల్లీ వాలా స్వీట్ హౌస్ కు నోటీసులు..
ఢిల్లీ వాలా స్వీట్ హౌస్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా అపరిశుభ్రతను చూసి అధికారులు అవాక్కయ్యారు. స్వీట్ హౌస్ నిర్వహణపై ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీమ్ హెడ్ వి.జ్యోతిర్మయి ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు నోటీసులు జారీ చేశారు.
ఈ విధంగా ప్రజారోగ్యంతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలకు సురక్షితమైన ఆహారం అందించాలని… లేని పక్షంలో చట్ట ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, అవసరమైతే సంబంధిత శాఖ సహకారంతో సీజ్ చేస్తామని హెచ్చరించారు.