Friday, November 22, 2024

భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం : మంత్రి ప్రశాంత్ రెడ్డి

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం… జిల్లా ప్రగతిపై ఆయన ప్రసంగించారు. 76వ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలకు ప్రజా ప్రతినిధులకు, స్వాతంత్ర్య సమరయోధులకు, తెలంగాణ అమర వీరుల కుటుంబాలకు, అధికారులకు, మీడియా మిత్రులకు నా శుభాకాంక్షలు మరియు విద్యార్థిని విద్యార్థులకు నా ఆశీస్సులు అన్నారు. స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి అయినది అని, ఈ 75 సంవత్సరాలలో భారతదేశం అనేక రంగాలలో అభివృద్ధి సాధిస్తూ భిన్నత్వంలో ఏకత్వాన్ని నిరూపించుకుంటూ ప్రపంచ దేశాలకు తమ సత్తా ఏంటో చాటిచెప్తూ ముందుకు సాగుతున్నద‌న్నారు.

ఈ సందర్భంగా స్వాతంత్ర్యం కొరకు జీవితాలను త్యాగం చేసిన వారిని ఒకసారి స్మరించుకొనుట మన విధి అన్నారు. స్వాతంత్ర్యం ఏర్పడే నాటికి భారత దేశం చిన్న చిన్న రాష్ట్రాలుగా విభిన్న భాషలు, విభిన్న ప్రాంతాలు, వ్యక్తుల మధ్య అసమానతలతో నిండి యున్నద‌న్నారు. స్వాతంత్ర్యం అంటే ప్రతి పౌరుడికి కనీస సౌకర్యాలైన కూడు, గూడు, గుడ్డ లభించేలా ఉండడం తమ కాళ్ళపై తాము స్వేచ్ఛాయుతంగా ఎదగడం అన్నారు. స్వాతంత్ర్యం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 15 రోజుల పాటు “స్వతంత్ర్య భారత వజ్రోత్సవాలు” ఆగష్టు 08 వ తేదీ నుండీ ఆగష్టు 22 తేదీ వరకు ప్రతి రోజు వివిధ కార్యక్రమాలను జరుపుచున్నది. ప్రతి ఇంట జెండా పండుగ జరుపుటకు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన నాడు రాష్ట్రం అనేక రంగాలలో సంక్లిష్ట పరిస్ధితులను ఎదుర్కొంటూ ఉన్నది. అలాంటి పరిస్థితుల నుండి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను అభివృద్ధి పథం వైపు మన ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుండి నడిపిస్తూ ఉన్నారు. నేడు రాష్ట్రం వ్యవసాయ రంగంలో దేశంలోనే ఉన్నత స్థానానికి చేరింది. అలాగే సంక్షేమానికి, అభివృద్ధికి పెద్ద పీట వేస్తూ దేశంలోనే రాష్ట్రం ముందంజలో ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలైన రైతుబంధు, రైతుభీమ, కేసీఆర్. కిట్టు, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, ఆసర పెన్షన్లు, గొర్రెల పంపిణి, చేపలు మరియు రొయ్యల పంపిణి, ధరణి, దళిత బంధు మొదలైనవి అమలు అవుతున్నాయి. ఈ జాతీయ పండుగ సందర్భంగా జిల్లాలో సాధించిన ప్రగతిని మీ ముందు ఉంచుతున్నాను.

Advertisement

తాజా వార్తలు

Advertisement