- రోగిని పరీక్షించకుండానే.. సిబ్బందే టెస్టులు రాసిన వైనం..
- ప్రైవేట్ ఆస్పత్రిలో దారుణం..
- ఇదేమిటని ప్రశ్నిస్తే దౌర్జన్యం..
నిజామాబాద్ ప్రతినిధి, డిసెంబర్ 30 (ఆంధ్రప్రభ) : ఆస్పత్రి సిబ్బంది డాక్టర్ గా అవతారమెత్తి.. రోగిని పరీక్షించకుండానే సిబ్బందే టెస్టులు రాసిన ఘటన నిజామాబాద్ నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. నాలేశ్వర్ గ్రామానికి చెందిన లక్ష్మీ అనే వృద్ధురాలు న్యూరో సమస్యతో బాధపడుతుంది. సోమవారం నిజామాబాద్ నగరంలోని ఖలీ ల్వాడి ప్రాంతంలో గల ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స కోసం తన కుమారుడితో వచ్చింది. ఆసుపత్రికి వచ్చిన రోగి పేరుని ఆసుపత్రి సిబ్బంది నమోదు చేసుకొని ఓపీకి సంబంధించిన ఫీజుని తీసుకున్నారు.
అంతేకాకుండా సదరు వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది రోగితో మాట్లాడి సమస్యను తెలుసుకొని పలు టెస్టులను వెంటనే చేయించుకొని రావాలని రోగికి ఓపీ చీటీపై రాసి ఇచ్చారు. రోగిని డాక్టర్ పరీక్షించకుండానే టెస్టులు రాయడం ఏమిటని సదరు రోగి కుమారుడు ఆస్పత్రి సిబ్బందిని ప్రశ్నించారు. దీంతో ఆస్పత్రి సిబ్బంది రోగితో దురుసుగా మాట్లాడడమే కాకుండా దౌర్జన్యం చేసినట్లు బాధితులు ఆరోపించారు. అంతేకాకుండా ఆసుపత్రి సిబ్బంది రోగికి టెస్టులు రాసిచ్చిన చీటీని లాక్కోవడానికి ప్రయత్నించారు.
దీంతో న్యాయం చేయాలని ఆసుపత్రి ఎదుట బాధితులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ… ఆసుపత్రిలో వైద్యు డు అందుబాటులో లేకున్నా సిబ్బంది రోగిని పరీక్షించి టెస్టులు ఎలా రాస్తున్నారని మండిపడ్డారు. ధనార్జనే ధ్యేయంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేట్ ఆస్పత్రుల ఆగడాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యశాఖ అధికారి వెంటనే విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు.