నిజామాబాద్ సిటీ, సెప్టెంబర్ 26 (ప్రభ న్యూస్) : ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ గణేష్ నిమజ్జనోత్సవం జరుపుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణతో కలిసి కలెక్టర్ మంగళవారం వినాయక శోభాయాత్ర కొనసాగే మార్గాన్ని పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతం నుండి శోభాయాత్ర ప్రారంభం కానుండగా, భారీ విగ్రహాలను నిమజ్జనం చేసే మార్గమైన అర్సపల్లి, సారంగాపూర్, జానకంపేట్, నవీపేట్, యంచ గ్రామాల మీదుగా బాసర బ్రిడ్జి వరకు గల మార్గాన్ని పరిశీలన జరిపారు. ఈ సందర్భంగా అక్కడక్కడా చెడిపోయి ఉన్న రోడ్డును యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయించాలని పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. శోభాయాత్రకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా రోడ్లకు ఇరువైపులా అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించా లని, తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను పైకి భిగించాలని సూచించారు.
ఈసందర్భంగా బాసర బ్రిడ్జి వద్ద కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ… వినాయక నిమజ్జన శోభాయాత్రకు అవసరమైన అన్ని సదుపాయాలను జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో కల్పిస్తామన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ శోభాయాత్ర నిర్వహించుకో వాలని హితవు పలికారు. ప్రధానంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా, నీటిలో మునిగి గల్లంతు కావడం, రోడ్డు ప్రమాదాలకు గురి కావడం వంటి ఘటనలు ఎక్కువగా జరిగేందుకు ఆస్కారం ఉన్నందున అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. పోలీస్, ఆర్ అండ్ బీ, ట్రాన్స్కో, పంచాయతీరాజ్ తదితర శాఖలన్నీ సమన్వయంతో పని చేస్తున్నాయని తెలిపారు. జానకంపేట్ రైల్వే క్రాసింగ్ వద్ద హై వోల్టేజ్ విద్యుత్ లైన్ ఉన్నందున 4.5 మీటర్లకు లోబడి ఎత్తు కలిగిన విగ్రహాలు మాత్రమే ఈ మార్గం గుండా బాసరకు వెళ్లేందుకు వీలుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అంతకంటే ఎక్కువ ఎత్తు కలిగిన విగ్రహాలను ప్రత్యామ్నాయ మార్గం ద్వారా నిమజ్జనానికి తరలించాలని సూచించారు. బాసర బ్రిడ్జి వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా వన్ వే విధానాన్ని అమలు చేయాలని స్థానికులు కోరగా, ప్రతిపాదనను పరిశీలిస్తామని కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. పోలీసులతో సమన్వయం చేసుకుని, వారి సూచనలు, సలహాలు తప్పనిసరిగా పాటించాలని, పోలీసులు సూచించిన మార్గం మీదుగా శోభాయాత్ర జరపాలని గణేష్ మండపాల నిర్వాహకులను కలెక్టర్ కోరారు.
నిమజ్జనానికి పటిష్టంగా ఏర్పాట్లు: సిపి
ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ మాట్లాడుతూ… నిమజ్జనోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నామన్నారు. సుమారు మూడు వేల వరకు వినాయక విగ్రహాలను నిమజ్జనం కోసం బాసరకు తరలించే అవకాశం ఉందని తెలిపారు. పౌరుల రక్షణే తమ ప్రధాన కర్తవ్యంగా విధులు నిర్వర్తిస్తున్నామని, ప్రశాంత వాతావరణంలో శోభాయాత్ర జరుపుకోవాలని, అన్నివర్గాల వారు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని సూచించారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికాబద్ధమైన చర్యలు చేపడతామన్నారు. నిజామాబాద్ ఏసీపీ కిరణ్ కుమార్, ట్రాన్స్ కో, మున్సిపల్, ఆర్ అండ్ బీ, అగ్నిమాపక, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు ఉన్నారు.