Wednesday, October 23, 2024

NZB | రైతు శ్రేయస్సుకు కృషిచేస్తే.. సహకార సంఘాల లక్ష్యం నెరవేరినట్టు..

నిజామాబాద్ ప్రతినిధి, అక్టోబర్ 23 (ఆంధ్రప్రభ) : రైతు శ్రేయస్సు కోసం పాటుపడినప్పుడే సహకార సంఘాల లక్ష్యం నెరవేరినట్టవుతుందని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. బుధవారం నిజామాబాద్ జిల్లా డిసిసిబి ప్రధాన కార్యాలయంలోరాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అధ్యక్షతన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పీఏసీఎస్ అధ్యక్షులకు, కార్యదర్శులకు నిర్వహించిన అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా మాజీ మంత్రి బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ… సహకార సంఘాలు అభివృద్ధి చెందాలంటే అధికారులకు పాలకవర్గాలకు మధ్య సంబంధం దగ్గరగా ఉండాలని, అందరూ కలిసి పనిచేసి సంస్థను అభివృద్ధి వైపు తీసుకుపోవాలన్నారు. సహకార సంఘాలు అంటే కేవలం వరి కొనుగోలు చేసి ఎరువులు అమ్మి కొనసాగించడం మాత్రమే కాదని, కేవలం వరి కొనుగోలు ద్వారానే సంస్థల మనుగడ కొనసాగదని ఆయన అన్నారు. సహకార సంఘాలలో ప్రతిపత్తి కాకుండా కమర్షియల్ వ్యాపారాలు చేసి సంస్థల భవిష్యత్తును బలంగా చేయాలన్నారు.

సహకార సంఘాల అభివృద్ధికి కృషి చేయాలి… ఎమ్మెల్యే భూపతిరెడ్డి
సహకార సంఘాలు అభివృద్ధి జరగాలంటే కేవలం వరి కొనుగోలు మాత్రమే కాకుండా ఇతర వ్యాపారాలు కూడా చేయాలని, చేపల పెంపకం కోళ్ల పెంపకం, పూల విక్రయం, పాలవిక్రయం వంటి వాటిలో సొసైటీలు పాల్గొని కొనుగోలు, విక్రయాలు చేస్తే సొసైటీలకు లాభదాయకంగా ఉంటుందని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. రైతుల నుండి వ్యాపారులు పాలు కొనుగోలు చేసి అధిక శాతం నీళ్లు కలిపి ప్రజలకు అందిస్తున్నారని అలా కాకుండా రైతుల నుండి సొసైటీలు పాలు సేకరించి ప్రజలకు అందించడం ద్వారా సొసైటీలకు కూడా లాభంగా ఉంటుందని, అదేవిధంగా చేపలు పెంచడంలో గాని కోళ్లు పెంచడంలో గాని సొసైటీలు తమ వంతుగా వరి కొనుగోలు చేసిన విధంగా వాటిని కూడా కొనుగోలు చేసి సప్లయర్ గా ఉండడం ద్వారా సొసైటీలకు లాభాలు చేకూరుతాయన్నారు.

- Advertisement -

సంస్థలు అభివృద్ధి చెందాలంటే అధికారులకు-పాలకవర్గాలకు మధ్య సంబంధాలు దగ్గరగా ఉండాలి..
సంస్థలు అభివృద్ధి చెందాలంటే అధికారులకు, పాలకవర్గాలకు మధ్య సంబంధాలు దగ్గరగా ఉండాలని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. ఎక్కడో జరిగే కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల సహకార సంఘాల విలువలు తగ్గిపోతున్నాయని, కానీ నిజానికి సహకార రంగాల పాత్ర ఎంతో కీలకమైనదని ఆయన అన్నారు. అదేవిధంగా సహకార సంఘాలు ఆర్థికంగా, బలంగా కావాలంటే కేవలం వరి కొనుగోలుపై ఆధార పడకుండా ఇతర వ్యాపారాలు చేసి సంస్థను లాభాదాయకంగా చేయొచ్చని, కావున కామన్ సర్వీస్ సెంటర్లు ప్రతి సొసైటీలో ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందిస్తూనే సంస్థకు ఆర్దిక లాభం సమకూర్చే ప్రయత్నాలు చేయడం జరుగుతుందని, అందులో భాగంగా నవంబర్ 30వ తేదీన హైదరాబాద్, వరంగల్ శిక్షణ కేంద్రాలలో సొసైటీ కంప్యూటర్ ఆపరేటర్లకు కామన్ సర్వీసింగ్ సెంటర్ పై ట్రైనింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ తర చంద్, మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, వ్యవసాయ కమిషన్ మేంబర్ గడుగు గంగాధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పగంగారెడ్డి, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఎండీ అన్న పూర్ణమ్మ, డీసీసీబీ డైరెక్టర్లు, డీసీఎంఎస్ డైరెక్టర్లు, వివిధ సొసైటీల అధ్యక్షులు, కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement