నిజామాబాద్ ప్రతినిధి, మే 28 (ప్రభ న్యూస్) : బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తే అడ్డుకుంటామని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డి విజయభేరీ సభలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేతుల మీదుగా ప్రకటించిన బీసీ డిక్లరేషన్ కు కాంగ్రెస్ కట్టుబడి ఉండాలని అన్నారు.
మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హోటల్ వంశీలో వివిధ బీసీ, కుల సంఘాల నాయకులతో కలిసి నిర్వహించిన విలేఖరుల సమావేశంలో రాజారాం యాదవ్ మాట్లాడుతూ…. లోక్ సభ ఫలితాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని రాజారాం యాదవ్ ఆరోపించారు. ఇప్పటికే ఎన్నికల కమిషన్, అధికార యంత్రాంగానికి సీఎం ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కులగణన, సామాజిక న్యాయం పేరుతో అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధిపొందిన కాంగ్రెస్.. మరోసారి బీసీలను మోసం చేసేందుకు సిద్ధమైందని విమర్శించారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒక మాట, తర్వాత మరోమాట.. రేవంత్ రెడ్డి రెండు నాల్కల ధోరణికి నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. వెంటనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి, కులగణన బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశా రు. శాస్త్రీయ పద్ధతిలో కులగణన చేసేందుకు.. విధి విధానాల కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. ఇప్పటికే కులగణన నిర్వహించి, దేశానికి ఆదర్శంగా నిలిచిన బీహార్ రాష్ట్రాన్ని మోడల్ గా తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దశాబ్దాల సామాజిక వర్గాల న్యాయమైన డిమాండ్ సాధన కోసం తెలంగాణ తరహా మరో పోరాటానికి అంతా సిద్ధం కావాలని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ బీసీ కుల సంఘాలు, బీసీ జనసభ తలపెట్టిన జూన్ 8న మహా ధర్నా, 15న సెక్రటేరియట్ ముట్టడికి సంపూర్ణ మద్దతు తెలిపాయి. ఈ కార్యక్రమంలో బుస్సా ఆంజనేయులు, వివిధ బీసీ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.