నిజామాబాద్ ప్రతినిధి, ఆగస్టు 14(ప్రభ న్యూస్) : నిజామాబాద్ నగరంలో ప్రభుత్వ భూములు కబ్జాకు గురైతున్నాయని, భూకబ్జాదారులపై చర్యలు తీసుకొని ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎంఐఎం జిల్లా అధ్యక్షులు మహమ్మద్ షకిల్ అహ్మద్, డిప్యూటీ మేయర్ ఇద్రిస్ ఖాన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును కోరారు. శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును ఎంఐఎం కార్పొరేటర్లు, నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ప్రభుత్వ భూముల కబ్జాపై వినతిపత్రం అందజేశారు.
ఈసందర్భంగా వారు మాట్లాడుతూ… నిజామాబాద్‌లోని సారంగాపూర్ శివార్‌లో ఉన్న సర్వే నెం.19 ప్రభుత్వ భూమిని ఒక కార్పొరేటర్ కబ్జా చేశారని ఆరోపించారు. గతంలో మునిసిపల్ కార్పొరేషన్ ఉద్యోగి సహాయంతో ఈ భూమిని ఓపెన్ ప్లాట్‌లుగా మార్చారని ఆరోపించారు. అంతేకాకుండా నకిలీ పత్రాలను సృష్టించి, ఆ అగ్రిమెంట్ ప్రభుత్వ భూమిని ఓపెన్ ప్లాట్ లుగా మార్చారని ఆరోపించారు.
నకిలీ పత్రాలు సృష్టించి ప్రభుత్వ భూములను భూకబ్జాదారులు అక్రమంగా ఆక్రమిస్తున్నారని చెప్పారు. మున్సిపల్ కార్పొరేషన్ లో అవినీతి అధికారులతో కుమ్మక్కై ప్రభుత్వ భూములకు పత్రాలు సృష్టించి యథేచ్ఛగా కబ్జా చేస్తూ ఆడిందే ఆట పాడిందే పాటగా ఉందని కబ్జాదారుల తీరుపై మండిపడ్డారు. భూ కబ్జాదారుల చెర నుంచి ప్రభుత్వ భూములను కాపాడేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.