నిజామాబాద్ సిటీ, అక్టోబర్ 27 (ప్రభ న్యూస్): ముదిరాజుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అన్నివర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ప్రభుత్వం ప్రత్యేక కృషి చేసిందని ఎమ్మెల్యే గణేష్ బిగాల అన్నారు. శుక్రవారం నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ లో గల విజయలక్ష్మి గార్డెన్ లో నిర్వహించిన ముదిరాజుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాలా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముదిరాజుల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నగరంలోని ముదిరాజ్ సంఘాలకు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసామన్నారు. రూ.50లక్షలతో నాగారం ప్రాంతంలో ముదిరాజ్ ల ఆరాధ్య దైవం పెద్దమ్మ తల్లి ఆలయాన్ని నిర్మిస్తున్నామన్నారు. నిజామాబాద్ నగరంలో ప్రతి కుల సంఘం భవనం నిర్మాణానికి తన ఎమ్మెల్యే కోట సీడీపీ నిధులు మంజూరు చేసాననీ తెలిపారు.
అందరూ ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. మీ అందరి సహకారంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజి, రైల్వే అండర్ బ్రిడ్జిని పూర్తి చేశామన్నారు. నగరంలోని ప్రతి ఇంటికి ఉచితంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజి కనెక్షన్ లు ఇస్తామన్నారు. మంచినీరు కావాలంటే ట్యాంకర్ల కోసం ఎదురుచూసే పరిస్థితి లేదన్నారు. ప్రతిరోజూ మిషన్ భగీరథ ద్వారా మంచి నీరు అందిస్తున్నామన్నారు. అధునిక సదుపాయాలతో వైకుంఠ దామాలు నిర్మించామన్నారు. అంత్యక్రియల అనంతరం తదుపరి కార్యక్రమాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసామన్నారు. సంక్షేమంలో భాగంగా నిజామాబాద్ నగరంలో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నామనీ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుపేద మహిళలకు సౌభాగ్య లక్ష్మీ పథకం కింద రూ.3వేలు ఇస్తామన్నారు. మరోసారి ఆశీర్వదించండి.. పెద్దమ్మ తల్లి దీవెనలతో మరింత పట్టుదలతో పనిచేస్తానని మాటిస్తున్నాననీ తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్, కార్పొరేటర్లు వెల్డింగ్ నారాయణ, మాజీ కార్పొరేటర్ జాలిగం గోపాల్, శివ కుమార్, మాధవ్ రావు, యాదగిరి, మధుసూధన్, అనిల్, బాలరాజు, శ్రీనివాస్, రాజయ్య, కిషన్, హనుమాండ్లు, మురళి, సతీష్, తదితరులు పాల్గొన్నారు.