Friday, November 22, 2024

NZB: భీమ్‌గల్ లిటిల్ ఫ్లవర్ పాఠశాలకు గ్లోబల్ ఐకాన్ అవార్డు పురస్కారం

భీమ్‌గల్ రూరల్, ప్రభ న్యూస్, మార్చి 11 : ఢిల్లీలోని ప్రముఖ జాతీయ రీసెర్చ్ ఈ సంస్థ ప్రైమ్ టైం రీసర్చ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ భీమ్‌గల్ పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలకు 11వ గ్లోబల్ ఐకాన్- 2024 అవార్డు ప్రకటించింది. ఢిల్లీలోని రెడిసన్ బ్లూ ప్లాజా హోటల్ లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షుడు కె.డి.ఠాకూర్ ఆధ్వర్యంలో ప్రముఖ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ చేతుల మీదుగా పాఠశాల కరస్పాండెంట్ షఫీ ఈ అవార్డును అందుకున్నారు.

దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో 108 అవార్డులు ప్రకటించగా.. వాటిలో స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రముఖ సంఘ సేవకులు, స్వచ్ఛందంగా ఉత్తమ సేవనందిస్తున్న డాక్టర్లు, ఉత్తమ నాణ్యమైన విద్యనందిస్తున్న పాఠశాలలు ఉన్నాయి. వాటిలో నుండి లిటిల్ ఫ్లవర్ పాఠశాలకు గ్లోబల్ ఐకాన్ అవార్డు రావడం గర్వకారణమని షఫీ సంతోషం వ్యక్తం చేశారు. మారుమూల ప్రాంతంలో ఉన్న లిటిల్ ఫ్లవర్ పాఠశాల ఈ అవార్డుకు ఎంపిక కావడం పట్ల సంస్థ నిర్వాహకులు కె.డి ఠాకూర్, క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కరస్పాండెంట్ షఫీని అభినందించారు. లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో చదివిన ఎంతో మంది విద్యార్థులు ఐఐటి, నీట్ వంటి పోటీ పరీక్షల్లో విజయం సాధించి దేశ విదేశాలలో మంచి ఉన్నత స్థానంలో ఉన్నారని విద్యా విధానంలో ఉత్తమ విలువలు, క్రమశిక్షణ ప్రాతిపదికన ఈ అవార్డు ఎంపిక జరిగిందని షఫీ తెలిపారు.

అవార్డు రావడంతో తన బాధ్యత మరింత పెరిగిందని, తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులను మరింత తీర్చిదిద్ది ఉత్తమ పౌరులుగా అందిస్తామని షఫీ భరోసా ఇచ్చారు. అవార్డు ప్రకటించిన సంస్థ నిర్వాహకులు ఠాకూర్ కి, అవార్డు రావడానికి కారణమైన తల్లిదండ్రులకు, బోధన సిబ్బందికి అలాగే విద్యార్థులకు షఫీ కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాలకు అవార్డు ప్రకటించడంతో పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement