Tuesday, November 26, 2024

మా డబ్బులు ఇప్పించండి… కలెక్టరేట్ ఎదుట చిట్ ఫండ్ బాధితుల ఆందోళన

నిజామాబాద్ సిటీ, జులై 10 : (ప్రభ న్యూస్) : రూపాయి రూపాయి కూడబెట్టి ఎంతో కష్టపడి జమ చేసిన డబ్బులను మధ్య తరగతి కుటుంబాలు… గంపెడు ఆశతో… పిల్లల భవిష్యత్తు కోసం.. గృహ నిర్మాణం కోసం ఏదైనా.. ఇతర ఆర్థిక అవసరాల నిమిత్తం… చీటీల రూపంలో డబ్బులు జమ చేస్తే… వారికి చుక్కెదురైంది… సామాన్య, మధ్యతరగతి కుటుంబాల అవసరాలను ఆసరాగా చేసుకుని ఏదో ఒకచోట చిట్ ఫండ్ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నా ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.. కనకదుర్గ చిట్ ఫండ్ బాధితులు పదుల నుంచి వందల సంఖ్యలో తమ డబ్బులు తమకు ఇప్పించాలంటూ ఆందోళన బాట పట్టారు. సదరు బాధితులు కనకదుర్గ చిట్ ఫండ్ లో చీటీ వేసిన కాలం పరిమితి పూర్తయి సంవత్సరం గడుస్తున్నప్పటికీ సంబంధించిన డబ్బులు ఇవ్వడంలో రేపు…మాపూ.. అంటూ మాట దాటవేస్తూ.. డబ్బులు ఇవ్వడం లేదంటూ బాధితులు ఆరోపిస్తున్నారు.

సోమవారం నిజామాబాద్ నగరంలోని కలెక్టరేట్ కార్యాలయానికి కనకదుర్గ చిట్ ఫండ్ బాధితులు అధిక సంఖ్యలో తరలివచ్చి చెల్లని చెక్కులతో నిరసన వ్యక్తం చేశారు. ప్రజావాణిలో బాధితులు తమ గోడును వెల్ల బుచ్చుకున్నారు. కష్టపడి దాచుకున్న డబ్బులను కనకదుర్గ చిట్ ఫండ్ యాజమాన్యం డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితులు గగ్గోలు పెడుతున్నారు. అదేవిధంగా కొందరికి చిట్ ఫండ్ నిర్వాహకులు చెల్లని చెక్కులు ఇస్తున్నారు. 12 నెలలుగా తమ డబ్బులు తమకు ఇవ్వాలంటూ చిట్ ఫండ్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఎవరూ పట్టించుకోకపోవడంపై బాధితులు వేల్పుల రమ్య లీల (నిజామాబాద్) రూ. 4లక్షలు, సురేష్ (3 లక్షలు), పాశం కృష్ణ రెడ్డి ( 8 లక్షలు) ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ నగరంలో ఏదో ఒకచోట ఇలాంటి సంఘటన జరుగుతున్నా.. సంబంధిత అధికారులు చర్యలు చేపట్టకపోవడం గమనారం. ఇప్పటికైనా తమ డబ్బులు తమకు ఇప్పించి.. న్యాయం చేయాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement