Saturday, November 23, 2024

కామారెడ్డిలో దారుణం.. విద్యుదాఘాతంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

కామారెడ్డి, ప్రభన్యూస్‌: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీడీ వర్కర్స్‌ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఇద్దరు భార్యభర్తలు, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. మృతులంత ఒకే కుటుంబ సభ్యులు కావడంతో కలకలం రేపింది. మృతులు హైమద్‌(35), పర్వీన(30), అద్నాన్‌(4), మాహిమ్‌(6)లుగా గుర్తించారు. ఈ మేరకు దేవునిపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలని కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలో ఆటో నడుపుకుంటూ హైమద్‌ తన కుటుంబాన్ని సాఫీగా సాగుతున్న వారి జీవనంలో వర్షాలు, విద్యుత్‌ షాక్‌ నలుగురు చనిపోయేలా కారణమయ్యాయి. హైమద్‌ భార్య పర్వీన, కుమారుడు అద్నాన్‌, కుమార్తె మహిమ్‌లు విద్యుత్‌ షాక్‌ తగిలి మృతి చెందారు. ఈ రోజు (మంగళవారం) మధ్యాహ్న సమయంలో హైమద్‌ భార్య పర్వీన బట్టలని ఆరవేసారు. వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఆ బట్టలని తీసేందుకు కూతురు మహిమ్‌ బట్టలు ఆరేసిన వైరు వద్దకు వెళ్ళింది. విద్యుత్‌ స్తంభం నుండి ఇంట్లోకి వచ్చే విద్యుత్‌ తీగలకు ఆ వైరు తగలడంతో షాక్‌ తగిలింది. ఆరేసిన బట్టలు తీసే సమయంలో ఈ విద్యుత్‌ ప్రమాదం జరిగింది.

బట్టలు ఆరేసిన వైరుకు ఇంట్లోకి విద్యుత్‌ సరఫరా అయ్యే వైరు తగలడంతో ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో కుమార్డెని కాపాడేందుకు వెళ్లడంతో ఒకేసారి ఇంట్లోని అందరికీ విద్యుత్‌ షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. విద్యుత షాక్‌ తగిలి బీడీ వర్కర్స్‌ కాలనీకి చెందిన హైమద్‌ కుటుంబంలోని అందరూ మృత్యువాత పడటంతో కామారెడ్డి జిల్లా కేంద్రంలో కలకలం సృష్టించింది. నలుగురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తలించారు. ఘటన స్థలానికి కామారెడ్డి డీఎస్పీ సోమనాథం, దేవునిపల్లి ఎస్సై ప్రసాద్‌, తహసీల్దారు ప్రేమ్‌ కుమార్‌లు చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement