నిజామాబాద్ ప్రతినిధి, మే 8 (ప్రభ న్యూస్) : సంఘ విద్రోహ శక్తులు కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడం చూస్తుంటే… ఎన్నికల్లో టెర్రరిస్టులతో పోటీ చేస్తున్నట్లే అనిపిస్తుందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ప్రకటన ఇందుకు ఉదాహరణగా కనిపిస్తుందన్నారు. పిఎఫ్ఐ, సిమీ, సున్ని ఆర్గనైజేషన్లకు కాంగ్రెస్ మాతృ సంస్థలా మారిందని ధ్వజమెత్తారు. 2001ఒక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్గనైజేషన్ ను 2029 వరకు రద్దు చేసిందన్నారు. దేశ విదేశాల్లో ఉన్న టెర్రరిస్టు ఆర్గనైజేషన్లు కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నాయన్నారు.
బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ… కేంద్రం బ్యాన్ చేసిన ప్రమాదకర సంఘాలు, సంస్థలు కాంగ్రెస్ కు మద్దతివ్వడం ఏమిటని ప్రశ్నించాలి. సున్ని ఆర్గనైజేషన్ దేశానికి ఎలాంటి సంబంధం లేకుండా కాంగ్రెస్ కు మద్దతు తెలపడం ఏమిటన్నారు. స్టూడెంట్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ పై 17 టెర్రరిస్టు కేసులున్నాయన్నారు. కేంద్రం గతంలోనే ఈ సంస్థను రద్దు చేసింది. ఇలాంటి సంస్థలు కాంగ్రెస్ కు మద్దతిస్తూ, నిధులు సమకూరుస్తున్నాయని ఆరోపించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల వద్దకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి తమాషాలు చేసేందుకు పర్యటనలు చేయొద్దని హితవు పలికారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నన్ని రోజులు పాకిస్థాన్ బలంగా ఉండేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశం అతి భయంకరంగా మారే పరిస్థితి ఉందన్నారు. దేశ సంపద పై మొట్ట మొదటి హక్కు ముస్లింలదే అని స్వయంగా మన్మోహన్ సింగ్ ప్రకటించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈసారి ప్రజలు బీజేపీకి 400 సీట్లు ఇవ్వాలి… రామ మందిరానికి తాళం పడొద్దు అంటే బీజేపీ గెలవాలని స్వయంగా ప్రధాని చెప్పారని తెలిపారు. ఈ ఎన్నికలు హిందువుల ఉనికి కాపాడే ఎన్నికలు.. హిందువులు కళ్ళు తెరుచుకోవాలన్నారు. ప్రజల్లో మార్పు రావాలని కోరారు. ప్రజా సంక్షేమం మోడీతోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్య నారాయణ, బీజేపీ అధ్యక్షుడు దినేష్ కులచారీ, జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాలం రాజు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.