Friday, November 22, 2024

kamareddy: ఫుడ్ పాయిజన్.. 40మంది విద్యార్థినీలకు అస్వస్థత

ఎల్లారెడ్డి : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల పరిధిలోని గిరిజన బాలికల పాఠశాలలో శుక్రవారం రాత్రి విద్యార్థినీలు బెండకాయ కర్రీతో భోజనం చేసిన తర్వాత 40 మంది విద్యార్థినీలకు కడుపునొప్పి, విరోచనాలు, వాంతులతో అస్వస్థత‌కు గుర‌య్యారు. దీంతో వెంటనే పాఠశాల ఆరోగ్య కార్యకర్త శుక్రవారం రాత్రి 12 గంటలకు విద్యార్థినీలను ఎల్లారెడ్డిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథ‌మ చికిత్స చేయించి పాఠశాలకు తీసుకువెళ్లారు. మళ్లీ శనివారం ఉదయం 10గంటల 30 నిమిషాలకు 15 మంది విద్యార్థినులకు కడుపునొప్పి, రక్త వాంతులు, విరేచనాలు కావడంతో విద్యార్థినీలు అస్వస్థత‌కు గురి కావడంతో ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

డాక్టర్లు విద్యార్థినీలకు వైద్య సేవలందిస్తున్నారు. సరిపడ బెడ్లు లేకపోవడంతో ఒక్కొక్క బెడ్ పై ఇద్దరు విద్యార్థినీలకు చికిత్స అందిస్తున్నారు. రాత్రి తిన్న ఆహారంతో పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయిందని పిల్లలు అస్వస్థత‌కు గురయ్యారని డాక్టర్ తెలిపారు. విద్యార్థినీలు అస్వస్థత‌కు గురి కావడంతో విద్యార్థినీల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించి నాణ్యమైన భోజనాన్ని అందించేలా చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. మిగతా విద్యార్థినీలకు ఎల్లారెడ్డిలోని గిరిజన గురుకుల పాఠశాలలో మత్తమాల ఆసుపత్రి వైద్య సిబ్బందితో వైద్య సేవలు అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement