Friday, November 22, 2024

Nizamabad : జలదిగ్భంధంలో వేల్పూర్.. పరిస్థితిని పరిశీలిస్తున్న మంత్రి వేముల

నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ సబ్ డివిజన్ లో రాత్రి భారీ వర్షం కురిసింది. వర్షంతో వేల్పూర్, ఆర్మూర్ లో రోడ్లు కూడా కోతకు గురయ్యాయి. ఈసందర్భంగా రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మంగళవారం వేల్పూర్ మండలంలో పర్యటించి వర్షాభావ పరిస్థితులను పరిశీలించారు. ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవద్దని, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైనా ప్రభుత్వం ధీటుగా పనిచేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసే బాధ్యత తనదేనని మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రజలకు భరోసా ఇచ్చారు.

వర్షానికి జరిగిన నష్టాన్ని వెంటనే ప్రభుత్వానికి అంచనాలు పంపించి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపడతామని తెలిపారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు ఉండడంతో ఎదురయ్యే పరిస్థితులకు అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని నిజామాబాద్ కలెక్టర్ కు ఆదేశించారు. కొంతమంది పేదల ఇళ్ళు కూలిపోయాయని, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్ళకు ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం అందించే ఏర్పాట్లు చేస్తామన్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఏ ఇబ్బందులు ఎదురైనా హెల్ప్ లైన్ నెంబర్లకు ఫోన్ చేస్తే అధికార యంత్రాంగం 24 గంటలూ సహాయం చేసేందుకు సిద్ధంగా ఉంటుందని మంత్రి ప్రశాంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement