మేడిపల్లి : జగిత్యాల – నిజామాబాద్ జాతీయ రహదారిపై మేడిపల్లి వద్ద మంగళవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల వైపు నుండి కోరుట్ల వైపు వెళ్తున్న హుందాయి వెన్యూ కార్ టీ-ఎస్ 21 ఎల్ 3498, కోరుట్ల వైపు నుండి జగిత్యాల వైపు వెళ్తున్న ఖాళీ లారీ 18 టి 7272 కారు ఎదురెదురుగా ఢీకొనడంతో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. లారీ అదే వేగంతో చెట్టుకు ఢీకొంది. ఈ సంఘటనలో లారీ డ్రైవర్‌కు, క్లీనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కారు లారీని ఢీకొని అదే వేగంతో ఎదురుగా కోరుట్ల వైపు బియ్యంతో వెళ్తున్న ప్యాసింజర్ ఆటోని సైతం వెనుక నుంచి బలంగా ఢీకొనడంతో ఆటోలో ఉన్న ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. కారు వేగం తీవ్రతకు కారు నుజ్జు నుజ్జు అయింది. కారు భాగాలు ఊడిపోయి రోడ్డుపై పడ్డాయి. కారు కోరుట్ల మండలం ధర్మారంకు చెందిందని స్థానికులు తెలిపారు.
కారు నడుపుతున్న వ్యక్తి ధర్మారం గ్రామానికి చెందిన ఇప్ప లింగారెడ్డి, పక్కన కూర్చున్న వ్యక్తి కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన ఇప్ప రమేష్‌లుగా గుర్తించారు. కారు నడుపుతున్న వ్యక్తి ఇప్ప లింగారెడ్డికి తీవ్రగాయాలు కాగా, క్షతగాత్రులను కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కారు నడుపుతున్న లింగారెడ్డి (41) మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. సిరికొండ గ్రామానికి చెందిన ఇప్ప రమేష్ (35) గల్ఫ్ దేశం వెళ్లి ఇటీ-వల తిరిగి వచ్చారు. ఈనెల 16న బెహరాన్ దేశం వెళ్లనున్నట్లు సమాచారం. రమేష్ భార్య డెలివరీ కోసం ఆసుపత్రిలో చేరగా, ప్రమాద విషయం తెలిసి బోరున విలపిస్తున్నట్లు బంధువులు తెలిపారు. ఆటోలో ఉన్న ఇద్దరు వ్యక్తులు, లారీ డ్రైవర్ క్లీనర్ కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.