పాల్వంచ, ప్రభన్యూస్, మే 30 : పాల్వంచ మండలంలోని భవానిపేట శివారులోని భూలక్ష్మి రైస్ మిల్ ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. రైస్ మిల్లర్లు వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. గత 4 రోజులుగా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైస్ మిల్ ఎదుట ట్రాక్టర్లలో, లారీల్లో వరి ధాన్యాన్ని ఉంచడంతో ఒక్కసారిగా వర్షాలు కురుస్తుండడంతో వరిధాన్యం తడిసి ముద్దయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
విషయం తెలుసుకున్న స్థానిక వైస్ ఎంపీపీ జీడిపల్లి నర్సింహారెడ్డి అక్కడికి చేరుకొని రైతులకు భరోసా ఇవ్వడం జరిగింది. అనంతరం జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అక్కడికి చేరుకొని రైస్ మిల్లర్లతో మాట్లాడి వెంటనే రైతులకు న్యాయం చేసే విధంగా అన్ లోడింగ్ త్వరగా చేయాలని ఆదేశించారు. వెంటనే లారీలను, ట్రాక్టర్ ను పంపి లోడింగ్ ప్రారంభించాలని రైస్ మిల్ యజమానులకు సూచించారు. ఈ సందర్భంగా రైతులు వైస్ ఎంపీపీకి ధన్యవాదాలు తెలిపారు.