నిజామాబాద్ సిటీ, జనవరి 31(ప్రభ న్యూస్) : నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో ఏకకాల పరిష్కార పథకం (ఓటీఎస్)ను పొడిగించినట్లు డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తెలిపారు. బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖలీల్వాడిలోని నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. సొసైటీ చైర్మన్లు, బ్యాంకులో లోన్లు తీసుకున్న రైతుల అభ్య ర్థన మేరకు ప్రవేశపెట్టిన ఏకకాల పరిష్కార పథకం (ఓటీఎస్) పథకాన్ని ఈనెల జనవరి 31వ తేదీతో ముగుస్తున్నందున, ఇంకను చాలా మంది రుణగ్రహితలు ఏకకాల పరిష్కార పథకం వినియోగించుకుని పాత రుణాల నుండి విముక్తి పొందవలసి ఉన్నందున పాలకవర్గ సమావేశంలో ఏక కాల పరిష్కార పథకాన్ని మార్చి 31తేదీ వరకు పొడిగించాలని నిర్ణయించినట్లు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తెలిపారు. ఏకకాల పరిష్కార పథకం ఫిబ్రవరి 1, నుండి మార్చి 31 వరకు అమలులో ఉంటుందన్నారు.
ఈనెల 31నాటికి కాల పరిమితి ముగిసి బ్యాంకు ద్వారా బట్వాడా చేయబడి సొసైటీల ద్వారా తీసుకున్న రుణాలపై అపరాధ వడ్డీ 100శాతం మాఫీ, వాయిదా మీరిన వడ్డీపైన 30శాతం మాఫీ చేయబడుననీ తెలిపారు. ఈనెల 31 నాటికి కాల పరిమితి ముగిసి బ్యాంకు ద్వారా తీసుకున్న (ఎన్ ఎఫ్ ఎస్), మార్ట్ గేజ్, ఎల్ టి, తదితర రుణాలపై వడ్డీ 32శాతం మాఫీ చేయబడునన్నారు. అర్హులైన రుణ గ్రహీతలు అందరూ ఏకకాల పరిష్కార పథకాన్ని సద్వినియోగం చేసుకొని బ్యాంకు అభివృద్ధికి సహకరించగలరనీ కోరారు. ఖచ్చితమైన వివరాల కోసం సంబంధిత సొసైటీలను, బ్రాంచ్ మేనేజర్ లను సంప్రదించాలని తెలిపారు.