నిజామాబాద్, డిసెంబర్ 13 (ప్రభ న్యూస్) : నిజామాబాద్ అర్బన్ లో ప్రజల నుండి వచ్చే సమస్యలు, వినతులపై తక్షణమే స్పందిస్తూ… నిర్ణీత గడువులోపు వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ఆదేశించారు. నిజామాబాద్ నిజామాబాద్ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు అధికారులు పూర్తి సహకారం అందించాలని పేర్కొన్నారు. ఇవాళ నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.మకరంద్ తో కలిసి నిజామాబాద్ నగరంలోని రెవెన్యూ అసోసియేషన్ భవనంలో సమీక్ష నిర్వహించారు. సందర్భంగా నగరంలో వివిధ పథకాల కింద చేపడుతున్న అభివృద్ధి పనులు, ఆయా నిధులతో కొనసాగుతున్న ప్రగతి కార్యక్రమాల గురించి కమిషనర్ ఎం.మకరంద్ ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇటీవలే తాను ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంగా ప్రజల నుండి విద్య, వైద్యం, తాగునీరు, రోడ్లు, వీధి దీపాలు, ఉద్యానవనాలు, ఐలాండ్స్, బస్తీ దవాఖానాలు, పెన్షన్లు, రేషన్ కార్డులు వంటి మౌలిక వసతులకు సంబంధించి అనేక మంది విజ్ఞాపనలు చేశారని శాసనసభ్యులు ధన్పాల్ తెలిపారు. తనపై నమ్మకంతో గెలిపించిన ప్రజలకు రానున్న ఐదేళ్ల కాలం పాటు స్థానికంగానే అందుబాటులో ఉంటూ సేవలందిస్తానని ఎమ్మెల్యే తన సంకల్పాన్ని వెల్లడించారు. అధికారుల సహకారం ఉన్నప్పుడే ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు వీలవుతుందని, ఈమేరకు అన్ని శాఖల అధికారులు తోడ్పాటును అందించాలని సూచించారు. క్రమం తప్పకుండా సమీక్షలు జరుపుతూ నగర అభివృద్ధికి బాటలు వేస్తానన్నారు. సమీక్ష సమావేశంలో నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, ట్రాన్స్ కో ఎస్.ఈ రవీందర్, డీ.ఈ.ఓ దుర్గాప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.