Wednesday, July 3, 2024

TG | డీఎస్ మరణం రాష్ట్రానికి తీరని లోటు : కేంద్ర మంత్రి బండి సంజయ్

నిజామాబాద్ ప్రతినిధి (ప్రభా న్యూస్) : ‘రాజకీయ దురంధరుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ మరణం రాష్ట్రానికి తీరని లోటని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. తెలంగాణకు అనుకూలంగా బీజేపీ కాకినాడ తీర్మానం చేసిన తరువాత కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించి ఎన్నికల మేనిఫెస్టోలో ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు’ అంశాన్ని పొందుపర్చేలా చేసిన ఘనత డీఎస్ కే దక్కుతుందన్నారు.

రాజకీయ చతురత కలిగిన డీఎస్ అజాత శత్రువుగా ఉంటూ తెలంగాణ అభివ్రుద్ధి, సంక్షేమం కోసం ఎంతగానో పాటుపడ్డారన్నారు. శనివారం సాయంత్రం నిజామాబాద్ నగరంలోని ప్రగతి నగర్ లో ధర్మపురి శ్రీనివాస్ పార్థివ దేహానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఎమ్మెల్యేలు పాయల శంకర్, ధన్ పాల్ సూర్యనారాయణగుప్త, రామారావు పటేల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ మనోహర్ రెడ్డి, అధికార ప్రతినిధి సంగప్ప తదితరులతో కలిసి డీఎస్ నివాసానికి వెళ్లారు.

డీఎస్ భౌతిక కాయానికి నివా ళులు అర్పించారు. ఆయన తనయుడు, ఎంపీ అరవింద్ ను పరామర్శించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి బండి సంజయ్ విలేకరులతో మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే సీనియర్ రాజకీయ నాయకులు, కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు (2004, 2009లో) అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన ధర్మపురి శ్రీనివాస్ (76 ఏళ్లు) గారి మరణం బాధాకరమన్నారు.

అందరూ ఆప్యాయంగా డీఎస్ అని పిలుచుకునే ధర్మపురి శ్రీనివాస్ దాదాపు 4 దశాబ్దాలకు పైగా రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేసి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. తన రాజకీయ చతురతతో పరిస్థితులను తలకిందులు చేయగల నేతగా గుర్తింపు తెచ్చుకున్న డీఎస్ గారు బలహీనవర్గాల అభివృద్ధికి నిరంతరం తపించేవారు. పార్టీకి ఎంతటి క్లిష్టమైన సమస్య ఎదురైనా ఫోన్ చేతిలో ఉంటే నేర్పుగా పరిష్కరించే సత్తా డీఎస్ కు ఉందని నాటి ముఖ్య మంత్రి దివంగత వైఎస్.

రాజశేఖర్ రెడ్డి బహిరంగంగానే చెప్పారంటే డీఎస్ గారి రాజకీయ చతురత ఎట్లాంటిదో అర్ధం చేసుకోవచ్చున్నారు.తెలంగాణ రాష్ట్ర సాధనలో డి.శ్రీనివాస్ పాత్రను మరువలే నిది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయం లో కాంగ్రెస్ హైకమాండ్ ను ఒప్పించం తోపాటు 2004లోనే ఎన్నికల మేనిఫెస్టో లో తెలంగాణ అంశాన్ని పొందుపర్చడంలో డీఎస్ చేసిన క్రుషిని ఎన్నటికీ మరువలేం. నాటి నుండి పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందే వరకు అత్యంత క్రియాశీల పాత్ర పోషించిన డీఎస్ గారిని తెలంగాణ ప్రజలు మర్చిపోలేరన్నారు. డీఎస్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement