నిజామాబాద్ ప్రతినిధి, మార్చి 22 (ప్రభ న్యూస్): పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మరోసారి ప్రజలను మోసం చేసేందుకే ఎంపీ ధర్మపురి అరవింద్ షుగర్ ఫ్యాక్టరీ పేరిట బాండ్ పేపర్ డ్రామా చేస్తున్నారని…. కల్లబొల్లి మాటలు నమ్మి మోసపోవద్దని బీఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. హామీలు ఇచ్చి మోసం చేయడం లో సిఎం రేవంత్, ఎంపీ అరవింద్ ఒక్కటే అనీ అన్నారు. ఎన్నికలలో లబ్ధి కోసమే నాటకం ఆడుతున్నాడని ఆరోపించారు. శుక్రవారం నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మ గుట్ట వద్దగల బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ… ఎంపీగా గెలవక ముందు షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని పాదయాత్ర చేశారని, గెలిచిన తర్వాత ఫ్యాక్టరీని ప్రైవేట్ భాగస్వామ్యంలో తెరిపిస్తానని ఆనాడే హామీ ఇచ్చి చెరుకు రైతులను మోసం చేసిన చరిత్ర ధర్మపురి అరవింద్ దేనని అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ మధ్యే ప్రధాన పోటీ అని తెలిపారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ ధర్మపురి అరవింద్ పసుపు బోర్డు తీసుకువస్తానని బాండ్ పేపర్ రాసి రైతులను మోసం చేసిన విషయం తెలిసిందేనన్నారు. ప్రధాని మోడీ చేత ప్రకటన చేయించిన ధర్మపురి అరవింద్ పసుపు బోర్డు ఎక్కడ పెట్టారో చూపాలని ప్రశ్నించారు. ఎంపీ ఓట్ల కోసం వచ్చినప్పుడు పసుపు బోర్డు ఎక్కడ అని ప్రజలు అడగాలని తెలిపారు. ప్రజలు, కార్యకర్తల మద్దతుతో ఎంపీగా గెలుస్తానని బాజిరెడ్డి గోవర్ధన్ ధీమా వ్యక్తం చేశారు. మార్కెట్లో పసుపు పెరుగుదలలో బీజేపీ ప్రమేయం లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి మోసం చేసేందుకు ఎంపీ ధర్మపురి అరవింద్ చెప్పే మాటలని నమ్మొద్దని ప్రజలకు సూచించారు.