బిక్కనూర్ : కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం ఇవ్వవలసిన నిధులు ఇవ్వకుండా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ చెప్పారు. ఈరోజు కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండల కేంద్రంలో సుమారు రూ.2.11కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ… కేంద్రం నుండి తెలంగాణకు రావాల్సిన 40శాతం వాటా నిధులు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఏ రాష్ట్రంలో అమలు కాని సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతుందని గుర్తుచేశారు. పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్తగా 10 లక్షల పింఛన్లను మంజూరు చేయడం జరిగిందన్నారు.
అర్హులైన వారికి ఈ నెల నుండి కొత్త పింఛన్లు అందించడం జరుగుతుందన్నారు. సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడం జరుగుతుందని వివరించారు. తెలంగాణ అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం అడ్డుకున్నప్పటికీ సీఎం కేసీఆర్ వెనుకంజ వేయకుండా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గాల్ రెడ్డి, జడ్పిటిసి పద్మ నాగభూషణం గౌడ్, సర్పంచ్ వేణు, మండల తెరాస అధ్యక్షులు నరసింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శేఖర్, రైతు సమన్వయ కమిటీ కన్వీనర్ రామచంద్రం, సిద్ది రామేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు హనుమంత రెడ్డి, ఉప సర్పంచ్ నరేష్, తెరాస నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.