నిజామాబాద్ సిటీ, జులై 22 (ప్రభ న్యూస్) : ఉద్యమకారులకు స్ఫూర్తిని కలిగించిన మహనీయుడు దాశరథి అని భారత జాగృతి రాష్ట్ర కార్యదర్శులు లక్ష్మీనారాయణ భరద్వాజ్, నరాల సుధాకర్ అన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలోని స్థానిక ఖిల్లా జైలులో శనివారం మహాకవి దాశరథి 99వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ… తొలి, మలి దశ ఉద్యమాల్లో దాశరథి మాటలు, పాటలు ఎందరో ఉద్యమకారులకు స్పూర్తిని కలిగించిందన్నారు.
కోటి రతనాల వీణ నా తెలంగాణ అనే గొప్ప పదాన్ని దాశరథి ఇదే జైలులో రాసారని జాగృతి శ్రేణులు గుర్తు చేసారు. వట్టికోట అళ్వారు స్వామితో కలిసి దాశరథి ఖిల్లా జైలులో 3 నెలలు శిక్షను అనుభవించిన సమయంలో బొగ్గుతో జైలు గోడలపై రజాకార్ల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా కవితలను రాసారని గుర్తు చేసారు. ఈ కార్యక్రమంలో భారత జాగృతి రాష్ట్ర కార్యదర్శులు లక్ష్మీనారా యణ భరద్వాజ్, నరాల సుధాకర్, అపర్ణ, పులి జైపాల్, పంచ రెడ్డి మురళి, తిరుమల శ్రీనివాస్ ఆర్య, సందీప్, ఆకాష్, విక్కీ, సంపత్, తదితరులు పాల్గొన్నారు