మాచారెడ్డి, జూన్ 28, ప్రభన్యూస్ : మాచారెడ్డి మండలంలోని కొత్తపల్లి గ్రామంలో రిలయన్స్ ఫౌండేషన్ అధ్వర్యంలో సమగ్ర వ్యవసాయ పద్ధతులను అవలంభిస్తున్న రైతుల వ్యవసాయ క్షేత్రాల్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ బుధవారం సందర్శించారు. కొత్తపల్లి గ్రామంలో సమగ్ర వ్యవసాయ పద్ధతులు పాటిస్తున్న శ్రీకాంత్, మల్లారెడ్డి అనే రైతులతో వారు పాటిస్తున్న పద్ధతులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి గ్రామంలో సాగునీటి వసతి వుంది.. కాబట్టి రైతులు వరి పంట మాత్రమే కాకుండా కూరగాయలు, పండ్లతోటల సాగు వైపు వెళ్ళాలని సూచించారు. శ్రీకాంత్, మల్లారెడ్డి చేస్తున్న సమగ్ర వ్యవసాయ పద్ధతులు (మెషీన్ ద్వారా నాటు వేయడం, నర్సరీ, కోళ్ల పెంపకం, చేపల పెంపకం, గొర్లు, మేకల పెంపకం మొదలగు వాటిని చూడడం జరిగింది.
మిగతా రైతులు కూడా ఈ విధంగా వ్యవసాయంతో పాటు ఇతర ఆదాయం సమకూర్చే పనులు చేసుకోవాలని సూచించారు. ఆ తర్వాత మచారెడ్డి గ్రామంలో మెహబూబ్ అనే రైతు డ్రాగన్ ఫ్రూట్ క్షేత్రాన్ని సందర్శించి, రైతు పాటిస్తున్న సమగ్ర పద్ధతులను అడిగి తెలుసుకున్నారు. రిలయన్స్ ఫౌండేషన్ మేనేజర్ రాజు ఫౌండేషన్ రైతులతో కలిసి చేస్తున్న వివిధ కార్యక్రమాలను వివరించారు. జిల్లా కలెక్టర్ రైతులకు ఆదాయాన్ని పెంపొందించుకొనే వివిధ కార్యక్రమాల గురించి సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బాలకృష్ణ, వ్యవసాయ అధికారి రమ్యశ్రీ, సర్పంచ్ లక్ష్మణ్, అభ్యుదయ రైతులు చంద్రయ్య, రిలయన్స్ ఫౌండేషన్ మేనేజర్ పులగం రాజు, వీరేశం, వినాయక్, నాగేందర్ గ్రామస్తులు పాల్గొన్నారు.