నిజామాబాద్ ప్రతినిధి (ప్రభ న్యూస్) : నిజామాబాద్‌లో రెస్టారెంట్ల పరిస్థితి దారుణంగా మారింది. హోటల్ భోజనంలో కోడి ఈక వచ్చిన ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. వివిధ పనులపై నందిపేట నుంచి నిజామాబాద్‌కు వచ్చిన ఓ వ్యక్తి నగరంలోని పూలాంగ్ ప్రాంతంలో బిర్యానీ దర్బారార్‌లో భోజనం చేసేందుకు వెళ్లాడు. సదరు వ్యక్తి బిర్యానీ ఆర్డర్ చేయగా… హోటల్ యాజమాన్యం తీసుకొచ్చిన ఆహారాన్ని ఆ వ్యక్తి తింటున్న సమయంలో బిర్యానీలో దుర్వాసన రావడమే కాకుండా కోడి ఈక కూడా కనిపించడంతో ఆ వ్యక్తి ఆశ్చర్యానికి గురయ్యాడు.
ఈ విషయంపై హోటల్ మేనేజర్ ని నిలదీయగా… పొంతనలేని సమాధానం ఇచ్చారు. దీంతో సదరు వ్యక్తి కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన కార్పొరేషన్ అధికారులు బిర్యానీ దర్బార్ లో ఆహారాన్ని పరిశీలించి తనిఖీలు నిర్వహించారు. భోజనంలో కోడి ఈక ఉందని నిర్ధారించుకుని బిర్యానీ దర్బార్ హోటల్‌పై రూ.5 వేలు జరిమానా విధించారు కార్పొరేషన్ అధికారులు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ఆహార పదార్థాలను పరిశుభ్రమైన వాతావరణంలో ఉంచాలని కార్పొరేషన్ అధికారులు హెచ్చరించారు.