నిజామాబాద్ సిటీ, నవంబర్ 17 (ప్రభ న్యూస్): రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విచ్చలవిడిగా బెల్ట్ షాపులు, వైన్ షాపులు పెట్టి యువతను, ప్రజలను తాగుబోతులుగా మార్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని మాజీ మంత్రి, నిజామాబాద్ అర్బన్ అభ్యర్థి మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధిలో పోటీ పడాలి.. తప్ప అవినీతిలో కాదనీ హితవు పలికారు.
ఇవాళ నిజామాబాద్ నగరంలోని ముదిరాజ్ గల్లి (పోచమ్మ గల్లి బొబ్బిలి వీధి)లో మాజీ మంత్రి, నిజామా బాద్ అర్బన్ అభ్యర్థి మహమ్మద్ అలీ షబ్బీర్ పాదయాత్ర చేశారు. అందరితో ఆప్యాయతగా కలుస్తూ ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తమ సమస్యలు పరిష్కరించుకోవాలని ఓట్లు అడుగుతూ ఎన్నికల ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. పట్టణంలో ఏ గల్లికి వెళ్లినా ప్రజలందరూ సమస్యలతో ఏ కరువు పెడుతున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం అభివృద్ధి చేశామంటున్నారు.. అభివృద్ధి కంటే అవినీతి కమిషన్లు వచ్చే పనులు మాత్రమే చేశారని మండిపడ్డారు. బీజేపీ అబద్ధాలు చెబుతూ నీ అకౌంట్లో 15 లక్షలు వేస్తాం, లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాయమాటలు చెప్పి యువతను కులాల, మతాల పేరిట రెచ్చగొట్టి వాళ్ళ భవిష్యత్తును నాశనం చేస్తుందన్నారు. యువతను రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్ధి పొందడం కాదు.. వారికి ఉపాధి, ఉద్యోగ, విద్య, ఆరోగ్య సదుపాయాలు కల్పించాలన్నారు. కేంద్రంలో 10 సంవత్సరాల నుండి అధికారంలో ఉండి ఏం అభివృద్ధి చేసారో చెప్పండని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తులు అమ్ముకోవడం తప్ప వేరే మార్గం తెలియదన్నారు. ప్రజల సొమ్ము దోచుకోవడం తన మిత్రులైన ఆదానీ.. అంబానీలకు పంచడం వాళ్లు బాగుపడ్డారు తప్ప దేశ ప్రజలు కానీ, తెలంగాణ ప్రజలు కానీ బాగుపడలేదన్నారు.
కాంగ్రెస్ గెలిస్తే తాము అభివృద్ధి చేస్తాం, పేదలను ఆదుకుంటామని, కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆడవిబిడ్డలు ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి కేసీఆర్ పాలనలో దాపురించిందన్నారు. అర్బన్ ప్రజలు ఒక్కసారి అవకాశమిచ్చి భారీ మెజార్టీతో గెలిపించాలని షబ్బీర్ అలీ కోరారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి గడుగు గంగాధర్, నగర అధ్యక్షులు కేశవ వేణు, పీసీసీ ఉపాధ్యక్షులు తాహెర్బిన్ హందాన్, కాంగ్రెస్ నాయకులు నరాల రత్నాకర్, తదితరులు పాల్గొన్నారు.