నిజామాబాద్, మార్చి 7(ప్రభ న్యూస్): బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ వ్యాపారులకు తొత్తుగా మారి వారి నుండి కోట్ల రూపాయల నల్లధనం విరాళాల పేరుతో తమ ఖాతాలో జమ చేసుకుందని మానాల మోహన్ రెడ్డి అన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అన్ని పార్టీల ఎలక్ట్రికల్ బాండ్ పథకం వివరాలను వెల్లడించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెప్పినప్పటికీ బీజేపీ అక్రమ లావాదేవీలను బహిర్గతం చేయనందుకు జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు ధర్నా చేపట్టారు. గురువారం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్ టిఆర్ చౌరస్తా వద్ద, ఎస్బిఐ బ్రాంచ్ ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ… 2017 నుండి రాజకీయ పార్టీలు తీసుకున్న ఎలక్ట్రికల్ బాండ్ (విరాళాలు) వివరాలను బహిర్గతం చేయాలని ఎలక్షన్ కమిషన్ కు 6 మార్చి 2024వ తేదీ వరకు అప్పగించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సుప్రీంకోర్టు తెలియజేసినప్పటికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బీజేపీ విరాళాల వివరాలను ఇంకా అందించలేదని ఆయన అన్నారు. బ్యాంకింగ్ రంగంలో ఆధునాతన సాంకేతికత ద్వారా కంప్యూటరైజ్డ్ సిస్టమ్స్ ద్వారా క్షణాల్లోనే లావాదేవీలు బయటికి వచ్చే టెక్నాలజీ ఉన్న కూడా కేవలం బీజేపీతో తమకు ఉన్న చీకటి ఒప్పందం కారణంగానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బీజేపీ విరాళాల వివరాలను బహిర్గతం చేయలేక పోతుందని, దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ఆయన అన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కడ విరాళాల వివరాలను బయట పెడితే బీజేపీ అసలు బండారం బయటపడుతుందోననే భయంతో మోడీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పై ఒత్తిడి తెచ్చి వారి వివరాలు బయటకు రాకుండా చూస్తున్నాడని, దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ఆయన తెలిపారు. వెంటనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2017 నుండి బీజేపీ ఎలక్ట్రికల్ బాండ్ (అక్రమ విరాళాల) వివరాలను బహిర్గతం చేయాలని మానాల మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.
చీకటి ఒప్పందం..
బీజేపీ పార్టీ ఎలక్ట్రికల్ బాండ్ పేరుతో కార్పొరేట్ కంపెనీల నుండి అక్రమ సంపాదనను విరాళంగా తీసుకుందని, ఎస్బిఐ బీజేపీ కలిసి చీకటి ఒప్పందం నడుపుతున్నాయని మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత అన్నారు. వివరాలను వెంటనే బహిర్గతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, పీసీసీ మాజీ కార్యదర్శి రాంభూపాల్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విక్కీ యాదవ్, జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వేణు రాజ్, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సంతోష్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు లింగం, జిల్లా వోబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు యాదగిరి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శేఖర్, వేల్పూరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు నర్సారెడ్డి, మక్లోర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు రవి, చందూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్, విజయ్ పాల్, వినయ్, పంచరెడ్డి చరన్, మోస్ర నర్సారెడ్డి, నందిపేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మహిపాల్, రుద్రుర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు అరుణ్ కుమార్, స్వామి గౌడ్, కైసర్, వినోద్, వరుణ్, నరేందర్ గౌడ్, రాజ గగన్, మహేందర్, మధు సుదన్, సంజయ్, నవీన్, తదితరులు పాల్గొన్నారు.