నిజామాబాద్ ప్రతినిధి, జూన్ 1(ప్రభ న్యూస్) : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటి స్థాయిలో న్యూరో (నరాల)కి సంబంధించిన వైద్యంలో మరింత సేవలు అందజేస్తున్నామని సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజు తెలిపారు. శనివారం నిజామాబాద్ నగరంలోని జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డాక్టర్ ప్రతిమా రాజ్ మాట్లాడుతూ .. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రెండు నెలల క్రితం న్యూరో సర్జరీ సేవలు ప్రారంభించామని, ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ సేవలను అందిస్తున్నామని తెలిపారు. ఇది వరకు తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ లో మాత్రమే న్యూరో శస్త్ర చికిత్స లను నిర్వహించేవారని చెప్పారు.
ఇప్పుడు మన నిజామాబాదులో కూడా ఈ సేవలను అందిస్తున్నామని తెలిపారు. గత రెండు నెలల నుండి దాదాపు 20మందికి ఈ న్యూరో శస్త్ర చికిత్సలను, డాక్టర్ వెంకట రమణారెడ్డి, డాక్టర్ మరియం శస్త్ర చికిత్స నిపుణుల ఆధ్వర్యంలో జరిపించడం జరిగిందని తెలిపారు. ఇందులో ఇద్దరి చిన్నారులకు న్యూరో శస్త్ర చికిత్సను జరిపించామని, మన జిల్లాలో వారికే కాక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి సరియైన ఆధారాలు లేకపోయినా కూడా వారికి శస్త్ర చికిత్సలను చేయించడం జరిగిందని తెలిపారు.
ఈ శస్త్ర చికిత్స చేయించుకున్న కొంత మంది పేషెంట్లు ఆసుపత్రికి వచ్చి ఇక్కడ సేవలు బాగున్నాయని తెలిపారని చెప్పారు. ఈ శస్త్ర చికిత్సలకు ప్రైవేటు ఆసుపత్రిలో సుమారు రూ.3 నుండి రూ.7 లక్షల రూపాయల ఖర్చుతో కూడుకున్నదన్నారు. ప్రజలకు నిరంతరం వైద్యం అందించడమే ధ్యేయంగా కృషి చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో చికిత్స చేసుకున్న రోగులు, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు పాల్గొన్నారు.