హైదరాబాద్, ఆంధ్రప్రభ: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికైన విద్యార్థుల తొలిజాబితాను ఇంచార్జీ వీసీ వి. వెంకటరమణ, డైరెక్టర్ సతీష్ విడుదల చేశారు. 2022-23 విద్యా సంవత్సరానికి మొదటి సంవత్సరంలో ప్రవేశానికి ఎంపికైన విద్యార్థులకు సీట్లను కేటాయించారు. ఈ ఏడాది మొత్తం 33 వేల 5 దరఖాస్తులు రాగా అందులో 1404 మంది విద్యార్థులకు సీట్లను కేటాయించారు. మొత్తం 1500 సీట్లు ఉండగా, అందులో 96 సీట్లు స్పెషల్ కేటగిరీ కింద మినహాయిస్తే మిగిలిన 1404 సీట్లకు విద్యార్థులను ఎంపిక చేశారు.
ఎంపికైన విద్యార్థుల్లో బాలికలకు 73 శాతం సీట్లు, బాలురులకు 27 శాతం సీట్లను కేటాయించారు. ఇందులో 99 శాతం సీట్లను ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే సాధించారు. అత్యధికంగా సిద్ధిపేట జిల్లా 212 సీట్లను సాధించి మొదటి స్థానంలో నిలిచింది. అత్యల్పంగా 6 సీట్లు సాధించి మహబూబ్‌నగర్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఎంపికైన విద్యార్థులకు ఈనెల 28, 29, 30 తేదీల్లో క్యాంపస్‌లో కౌన్సెలింగ్‌ను నిర్వహించనున్నారు.