Friday, November 22, 2024

కల్లు కోసం ఆస్పత్రి నుంచి పరారైన కరోనా రోగి

కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఓ కరోనా రోగి పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. పిట్లం మండలం తిమ్మానగర్‌ గ్రామానికి చెందిన 55 ఏళ్ల వ్యక్తికి ఇటీవల కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో అతడిని కుటుంబీకులు కామారెడ్డి ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. అయితే బుధవారం ఉదయం కరోనా రోగి ఆస్పత్రి నుంచి పారిపోయాడు. రెగ్యులర్ చెకప్‌కు వచ్చే వైద్య సిబ్బంది ఈ విషయం తెలుసుకుని అవాక్కయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు, మున్సిపల్ అధికారులు బాన్సువాడ పట్టణంలో కరోనా రోగి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలించారు. చివరకు అతడు సంగమేశ్వర కాలనీలోని వాటర్‌ ట్యాంక్‌ వద్ద ఓ మూలన అర్ధనగ్నంగా కూర్చుని కనిపించాడు. ఆస్పత్రి నుంచి ఎందుకు పారిపోయావని పోలీసులు నిలదీయగా.. తనకు తాగడానికి కల్లు దొరకలేదని, అందుకే పారిపోయి వచ్చానని కరోనా పేషెంట్ చెప్పాడు. పోలీస్ సిబ్బంది అంబులెన్సులో ఎక్కించేందుకు యత్నించగా.. ఆస్పత్రికి రానంటూ అతడు మొండికేశాడు. తనకు కల్లు కావాలని తెగేసి చెప్పాడు. దీంతో పోలీసులు చేసేదేమీ లేక.. రెండు లీటర్ల కల్లు తెప్పించి కరోనా బాధితుడికి ఇచ్చారు. అది తాగిన తర్వాత అతడిని ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement