నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా సాలూర మండలం కుమ్మన్ పల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ గంగాప్రసాద్ (32) మృతదేహం ఇవాళ సాయంత్రం స్వగ్రామానికి చేరుకోనుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఈ మేరకు భారత ఆర్మీ అధికారులు జిల్లా యంత్రాంగానికి సమాచారం అందించారన్నారు. సిక్కిం రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా మంగళవారం రాత్రి తీస్తా నది ఉధృతరూపం దాల్చి సంభవించిన వరదల్లో ఆర్మీ జవాన్ గంగాప్రసాద్ గల్లంతై మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది.
ప్రకృతి విలయం బారినపడి 23మంది జవాన్లు గల్లంతు కాగా, వారి ఆచూకీ కోసం జరిపిన గాలింపు చర్యల్లో గంగాప్రసాద్ మృతదేహం గురువారం లభ్యమైనట్టు ఆర్మీ అధికారులు సమాచారం ఇచ్చారు. ఆయన మతదేహానికి పోస్టుమార్ధం నిర్వహించిన మీదట ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు తరలించారని, అక్కడి నుండి నేటి సాయంత్రం స్వగ్రామమైన కుమ్మన్ పల్లికి ఆర్మీ జవాన్ పార్థీవదేహం చేరుకుంటుందని కలెక్టర్ తెలిపారు.