నిజామాబాద్, వేల్పూర్ : పచ్చని జీవితాలను విచ్ఛిన్నం చేస్తూ ఆరోగ్యకర సమాజాన్ని పాడు చేస్తున్న గంజాయి మహమ్మారిని అంతమొందించాలని నిజామాబాద్ జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అదేశించారు. మంగళవారం నిజామాబాద్ సీపీ నాగరాజు, కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి పలువురు పోలీసు అధికారులు మంత్రిని వేల్పూర్ క్యాంపు కార్యాలయంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఇటీవల కొద్ది రోజులుగా తరచూ మంత్రి దృష్టికి వస్తున్న గంజాయి మహమ్మారి వినియోగంపై పోలీసు అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్రాణాంతకంగా మారుతున్న గంజాయి అసలు ఎక్కడి నుండి సప్లయ్ అవుతుంది.? ఎక్కడికి సప్లయ్ అవుతుంది.? దాన్ని సరఫరా చేసే ముఠా ఎవరు? మహమ్మారి భారిన పడిన వాళ్ళు ఎవరు? అంతమొందించేందుకు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు పై మంత్రి కూలంకషంగా సమీక్ష నిర్వహించారు. యువత భవిషత్తు నాశనం చేస్తూ.. సమాజానికి ప్రమాదకరంగా మారిన గంజాయికి అడ్డుకట్ట వేయాలని, ఉక్కుపాదంతో అనిచివేయలాని పోలీసు అధికారులకు సూచించారు. గంజాయి సాగు, దాన్ని సరఫరా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, పిడి యాక్టు కేసులు నమోదు చేసి కఠిన శిక్షలు పడేలా చూడాలని అన్నారు. నిందితులు ఎంతటి వారైనా ఉపెక్షించేది లేదని, పచ్చని జీవితాలను విచ్ఛిన్నం చేస్తున్న మహమ్మారి భరతం పట్టాలని మంత్రి పోలీసు అధికారులకు స్పష్టం చేశారు. అదే సమయంలో నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరిండెంట్ తో మంత్రి ఫోన్లో మాట్లాడి జిల్లా పోలీసు యంత్రాంగం తో సమన్వయం చేసుకొని గంజాయి నిర్మూలనకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు.
అట్లాగే బాల్కొండ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలకు గంజాయి సప్లై అవుతుందని తన దృష్టికి వచ్చిందని..ఎక్కడి నుండి వస్తుందని మంత్రి పోలీసు అధికారులకు అడిగి తెలుసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా నేరెడుకొండ మండలం లింగట్ల, బోర్గాం గ్రామాల నుంచి సరఫరా అవుతుందని, నిఘా పెంచామని మంత్రికి పోలీసు అధికారులు వివరించారు. వెంటనే అదిలాబాద్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ తో మంత్రి ఫోన్లో మాట్లాడారు.. ఎట్టి పరిస్థితుల్లోనూ గంజాయి సాగు కాకుండా, సరఫరా కాకుండా చూడాలని.. సరఫరా చేస్తున్న వ్యక్తులను గుర్తించి బాధ్యులపై కఠినంగా వ్యవహరించాలని అదేశించారు. ముఖ్యమంత్రి కేసిఆర్ రాష్ట్రంలో మత్తు పదార్థాల నిర్మూలన కోసం కఠిన చర్యలు చేపట్టారని ఈ సంధర్బంగా గుర్తు చేశారు. అదే విధంగా గంజాయి సాగు చేసే వారికి రైతు బంధు కట్ చేస్తామని,పైగా కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరికలు తెలియజేయాలని అన్నారు. ప్రజల్లో… ముఖ్యంగా యువతలో గంజాయి వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రతి గ్రామంలో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని సూచన చేశారు. గంజాయి నిర్మూలణ కార్యక్రమాల్లో ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేసి వారిని చైతన్య వంతులను చేయాలని చెప్పారు. ఎక్కడికక్కడ ప్రజలే కథానాయకులు అయితే అనుకున్న లక్ష్యం దిశగా పయనిస్తామని మంత్రి పోలీసు అధికారులతో అన్నారు. ఈ సమావేశంలో నిజామాబాద్ సిపి,ఎస్పీ కామారెడ్డి, ఏసీపీ ఆర్మూర్ ప్రభాకర్, బాల్కొండ సి.ఐ లు, ఎస్ ఐ లు పాల్గొన్నారు.