కామారెడ్డి, ఆగస్టు 3 (ప్రభ న్యూస్): 2023-25 సంవత్సరానికి నూతన మద్యం పాలసీ ద్వారా రిజర్వేషన్ లను ఖరారు చేయడానికి జిల్లా ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ లక్కీ డ్రా తీశారు. గురువారం కామారెడ్డి ఐ.డి.ఓ.సి.లోని కాన్ఫరెన్స్ హాల్ లో ఎస్సి, ఎస్టీ, బిసి త్రిసభ్య కమిటీ అధికారుల ఆధ్వర్యంలో లక్కీ డ్రా చేపట్టారు. జిల్లాలో 49 మద్యం దుకాణాలకు గాను 14మద్యం దుకాణాల రిజర్వేషన్లను ఖరారు చేశారు.
ఇందులో గౌడ కులానికి 15శాతం అనగా 7, ఎస్సీలకు 10 శాతం 5, ఎస్టీలకు 5 శాతం 2 మద్యం దుకాణాలు లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశారు. 70 శాతం అనగా 35 మద్యం దుకాణాలు జనరల్ కు కేటాయించారు. లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు ఇలా ఉన్నాయి. గౌడ కులస్తులకు 3,10,14,26,35,43,46 దుకాణాలు, ఎస్సిలకు 5,15,19,28,37 దుకాణాలు, ఎస్టీ లకు 29, 31 దుకాణాలు కేటాయింపబడ్డాయి. ఈ కార్యక్రమంలో జిల్లా ఆబ్కారీ పర్యవేక్షకులు యస్.రవీంద్ర రాజు, ఎస్సి, ఎస్టీ, బిసి అధికారులు, ఆబ్కారీ శాఖ అధికారులు పాల్గొన్నారు.