Friday, November 22, 2024

NZB: గ్రామ బహిష్కరణ చేసిన వీడీసీలపై చర్యలు తీసుకోవాలి..

నిజామాబాద్ ప్రతినిధి, ఆగస్టు 16( ప్రభ న్యూస్): నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్ పల్లి గ్రామంలో గ్రామ బహిష్కరణ చేసిన వీడీసీలపై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రజకుల సంఘం జిల్లా సభ్యులు చింతకుంట శంకర్, ప్రధాన కార్యదర్శి నరేష్, జక్రాన్ పల్లి రజకులు డిమాండ్ చేశారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రజక సభ్యులు, గూపన్పల్లి శంకర్, నరేష్ లు మాట్లాడుతూ… త‌మ గ్రామంలో ఎవరైనా త‌మతో మాట్లాడితే జరిమానా విధిస్తామంటూ వీడీసీలు హుకుం జారీ చేశారని రజక సభ్యులు ఆరోపించారు.

త‌మపై ఆంక్షలు విధిస్తూ గ్రామ బహిష్కరణ చేశారంటూ గత నెలలో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా నాన్ బెయిల‌బుల్ కేసు కూడా నమోదు చేయడం జరిగిందని చెప్పారు. కానీ ఇప్పటివరకు వీడీసీలను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. అంతేకాకుండా రెండు రోజుల క్రితం త‌మపై కేసులు నమోదు చేస్తారా అంటూ భయభ్రాంతులకు గురి చేస్తూ త‌మపై దాడి చేశారని రజకులు ఆరోపించారు.

ఈ దాడిలో వీడీసీలపై మరో కేసు కూడా నమోదు చేయడం జరిగిందని చెప్పారు. బహిష్కరణ, దాడిపై వీడీసీలపై రెండు కేసులు నమోదైనా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడీసీల ఆగడాలకు అంతే లేదని మమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. ఈ గ్రామ బహిష్కరణపై పూర్తి విచారణ చేపట్టి వీడీసీలపై చర్యలు తీసుకొని త‌మకు న్యాయం చేయాలని రజక సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో జగడం సురేష్, పద్మ, గంగా మోహన్, భూషణ్, రజకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement