నిజామాబాద్ క్రైమ్, (ఆంధ్రప్రభ) : నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ లో గల కాకతీయ ఒలంపియాడ్ పాఠశాలలో జరిగిన ఘటనలో ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసినట్లు మూడవ టౌన్ ఎస్ఐ తెలిపారు. గత కొన్ని రోజుల క్రితం కాకతీయ ఒలంపియాడ్ పాఠశాలలో తరగతి గదిలో విద్యార్థి మనోభావాలు దెబ్బతినేలా ఉపాధ్యాయుడు అవమానపరిచాడు.
దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు… న్యాయం చేయాలని విద్యార్థి తల్లిదండ్రులు స్థానిక మూడో టౌన్ లో ఫిర్యాదు చేశారు. బాధితుడు ఫిర్యాదు మేరకు పాఠశాలలో జరిగిన ఘటనపై తోటి విద్యార్థులతో పోలీసులు విచారణ చేపట్టారు.
విద్యాశాఖ చర్యలేవి ?
కాకతీయ ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారికి విద్యార్థి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ విషయమై విద్యాశాఖలో అధికారులను సంప్రదించగా డీఈవో సెలవులో ఉన్నాడు…. అప్పటివరకు ఏం చేయలేము అని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు.
కాకతీయ విద్యా సంస్థలో విద్యార్థులకు పూర్తిగా భద్రత కరువైందని విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా సుభాష్ నగర్ లోని కాకతీయ ఒలంపియాడ్ పాఠశాలకు అనుమతులు లేవని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపించారు. ఘటన జరిగి ఇన్ని రోజులు గడుస్తున్న సంబంధిత విద్యాశాఖ పట్టించుకోకపోవడం వెనుక విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.