Saturday, November 16, 2024

Nizamabad – యాసంగి ముంద‌స్తు! పొలం ప‌నుల్లో ప‌ల్లెలు బిజీ

నిజామాబాద్ జిల్లాలో ప్రారంభ‌మైన వ‌రి నాట్లు
ఓ వైపు వానాకాలం వ‌రి కోతలు.. మ‌రో వైపు యాసంగి సాగుకు ఏర్పాట్లు
మంజీరా తీరంలో ఊపందుకున్న సెకండ్ సీజ‌న్‌

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, నిజామాబాద్: తెలంగాణ‌లో ఒక వైపు వ‌రి కోత‌లు ఇప్పుడిప్పుడే ఊపందుకున్నాయి. మ‌రో వైపు వానాకాలం సీజ‌న్ పంట‌కు సంబంధించిన వ‌రి విక్ర‌యాల్లో రైతులు త‌ల‌మున‌క‌ల‌య్యారు. ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన కొనుగోళ్లు కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఒక్క ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాలో యాసంగి పంట‌ల‌కు రైతులు సిద్ధ‌మ‌య్యారు. నిజామాబాద్, కామ‌రెడ్డి జిల్లాల్లో యాసంగి సాగు ముంద‌స్తుగా ప్రారంభ‌మైంది. ప‌లుచోట్ల వ‌రి నాట్లు వేస్తున్నారు. రాష్ట్రంలో యాసంగి పంట‌ల సాధార‌ణ సాగు 54,93,444 ఎక‌రాలు కాగా, ఒక్క నిజామాబాద్ జిల్లాలో 8.1 ల‌క్ష‌ల ఎక‌రాలు సాగు అవుతుంది. అయితే రాష్ట్రంలో ఇంకా ఎక్క‌డా యాసంగి సాగు ప్రారంభం కాలేదు. ధాన్యం విక్ర‌యాల్లో త‌ల‌మున‌క‌ల‌య్యారు.

- Advertisement -

వ‌రి మ‌ళ్లు సిద్ధం

రాష్ట్రంలో వానా కాలం సీజ‌న్‌కు సంబంధించి వరి కోతలు, కొనుగోళ్ళు జరుగుతున్నాయి. కానీ నిజామాబాద్ జిల్లాలో యాసంగి సాగుకు సంబంధించి వ‌రి నాట్లు ప్రారంభ‌మ‌య్యాయి. ఖరీఫ్ కోతలు పూర్తి చేసుకుని, దుక్కి దున్ని వరి మ‌డులు సిద్దం చేశారు. వారం రోజుల కింద‌టే వరి నాట్లు మొదలయ్యాయి. ఇక్కడి రైతాంగం ఎవ‌రిపై ఆధార‌ప‌డ‌కుండా స్వ‌త‌హాగా సాగు చేసుకుంటుంటారు. ఎక్కువ మంది రైతులు సేంద్రియ సాగు వైపు మొగ్గుచూపుతున్నారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు ఎనిమిది లక్షల ఎకరాల్లో ఈసారి రబీ సీజన్ లో వరి సాగయ్యే పరిస్థితులు ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో 3 లక్షల 40 వేల ఎకరాల్లో, నిజామాబాద్ జిల్లాలో 4 లక్షల 70 వేల ఎకరాల్లో సాగు చేయనున్నారు.

మంజీరా తీరా ప్రాంతంలో…

మంజీరా నది తీరంలోని బోధన్, వర్ని, బాన్సువాడ, రెంజల్ ప్రాంతాల్లో అత్యధికంగా వరి సాగు చేస్తారు. 90 శాతం వరి సాగు జరిగితే మిగ‌తా 10 శాతం మాత్రమే ఇతర పంటలు సాగు చేస్తారు. ఇక్కడి నుంచి పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్నాటకలకు పెద్ద ఎత్తున నాణ్యమైన వరి ధాన్యం సరఫరా జరుగుతుంది. దీంతో పాటు సిరికొండ, ధర్పల్లి, బాల్కొండ, కమ్మర్పల్లి, ఏర్గట్ల మండలాల్లో కూడా ముందస్తుగా యాసంగి సాగు మొదలు పెట్టారు. మంజీరా నది తీర ప్రాంతాల్లో పుష్కలమైన సాగునీరు వుంటుంది. దీనికి తోడు అక్కడ భూములు వరి సాగుకు అనుకూలంగా ఉంటాయి. మంజీరా నదిపై నిర్మించిన నిజాం సాగర్ ప్రాజెక్టు, అతి పెద్ద ప్రాజెక్టు శ్రీరాంసాగర్ తో పాటు చిన్న ప్రాజెక్టులు, గుత్పా, అలిసాగర్ లాంటి పెద్ద ఎత్తిపోతలు కలిపి 60 కి పైగా ఎత్తిపోతలు ఉన్నాయి. పూర్తిగా నీటి ఆధారంగా సాగయ్యే వరికి సరిపడా సాగునీటికి లోటు లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement