Sunday, November 24, 2024

Nizamabad – న్యాయవిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి – రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహ రెడ్డి

నిజామాబాద్ సిటీ, డిసెంబర్ (ప్రభ న్యూస్)23: న్యాయవాదుల సంక్షేమం, వృత్తిపరమైన ఎదుగుదల కు బార్ కౌన్సిల్ కృషి చేస్తున్నదని తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహ రెడ్డి తెలిపారు.నిజామాబాద్ జిల్లాకోర్టు ప్రాంగణంలోని పిపి గంగారెడ్డి మోమోరియల్ హల్ లో నిర్వహించిన సెమినార్ లో ఆయన నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల న్యాయ వాదులనుద్దేశించి ప్రసంగించారు. బార్ కౌన్సిల్ నిరంతర ఆలోచనల కు,ఆచరణ రూపమిచ్చి న్యాయవాదుల సంక్షేమ పథకాలకు బాటలు వేస్తున్నామని ఆయన అన్నారు.న్యాయవాదులలో న్యాయసంబందిత విషయ పరిజ్ఞానం పెంపొందించడానికి సెమినార్లు ప్రయోజనకారిగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

బార్ కౌన్సిల్ కు ప్రభుత్వo నుండి రావలసిన ఆర్థిక వనరులు సమీకరించుకుని మరిన్ని ప్రగతి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టుకుంటామని ఆయన తెలిపారు. బార్ కౌన్సిల్ వైఎస్ చైర్మన్ సునీల్ గౌడ్,బార్ కౌన్సిల్ సభ్యులు రాజేందర్ రెడ్డి,కొల్లి సత్యనారాయణ, ఆనంతసేన రెడ్డి, బైరపాక జయకర్,కొండారెడ్డి, కిరణ్ పాలకుర్తి,రామారావు, మదూసుధన్ తమ సందేశాలను అందజేశారు.

బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి ప్రసంగిస్తూ గిరిగీసుకుని ఉండరాదని అన్ని న్యాయసంభందిత విషయపరిజ్ఞానం సముపార్జించుకోవాలని నూతన చట్టాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని తెలిపారు.

ముఖ్యఅతిథిగా హాజరైన నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల మాట్లాడుతూ న్యాయవాదులు నిత్య విద్యార్థులేనని నిరంతర అధ్యయనమే వృత్తిని వృద్ధి చేస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుల న్యాయకోవిధుల పరివారం నిజామాబాద్ జిల్లాకోర్టులో జరుగుతున్న సెమినార్ కు తరలివచ్చారని వారు వెదజల్లే న్యాయవిజ్ఞాన బాండాగారాన్ని అందిపుచ్చుకోవాలని ఆమె కోరారు. బార్ అండ్ బెంచ్ మధ్య సమన్వయం,న్యాయవిషయాలలో పరస్పర సహకారం అవసమని ఆమె అన్నారు. విశేష పరిహార చట్టం-ఆచరణాత్మక విధానాలు అనే అంశంపై కిరణ్ పాలకుర్తి వివరించారు.

నేరవిచారణ-సాక్షిని ప్రతివాది న్యాయవాది ప్రశ్నించే విధానాల గూర్చి సీనియర్ హైకోర్టు న్యాయవాది విద్యాసాగర్ రెడ్డి తెలియజేశారు.
సెమినార్ కు సమన్వయ కర్తగా బార్ కౌన్సిల్ సభ్యులు మంథని రాజేందర్ రెడ్డి వ్యవహరించారు.
సెమినార్ లో నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవదాసు, ఉపాఢ్యక్షుడు ఆశ నారాయణ, ప్రధాన కార్యదర్శి భాగీ చరణ్,తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ కార్యదర్శి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement