Friday, November 22, 2024

Nizamabad – ఎన్నికల విధులను నిష్పక్షపాతంగా నిర్వర్తించాలి – నిఘా బృందాలకు కలెక్టర్, సీ.పీ దిశానిర్దేశం

నిజామాబాద్ సిటీ, అక్టోబర్ (ప్రభ న్యూస్)26 : ఎంతో బాధ్యతతో కూడుకుని ఉండే ఎన్నికల విధులను పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సూచించారు. రాష్ట్ర శాసనసభ -2023 ఎన్నికలను పురస్కరించుకుని స్టాస్టిక్ సర్వైలెన్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ తదితర నిఘా బృందాల అధికారులకు గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఆయా పార్టీలు, అభ్యర్థుల ప్రచార సరళి పరిశీలన, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యలను నిరోధించడం, ఫిర్యాదులపై తక్షణమే స్పందించడం, నిరంతర తనిఖీల నిర్వహణ తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రస్తుతం ఐదు రాష్ట్రాలలో శాసన సభ ఎన్నికలు జరుగుతుండగా, ఎన్నికల వ్యయం విషయంలో ఎలక్షన్ కమిషన్ తెలంగాణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తోందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని నిఘా బృందాలు సమర్ధవంతంగా, నిబద్దతతో నిర్వహించాలని హితవు పలికారు.

ఎన్నికల సంఘం నిబంధనలను తు.చ తప్పకుండా పాటించాలని, అన్ని పార్టీలు, అభ్యర్థుల పట్ల నిబంధనలకు అనుగుణంగా సమదృష్టితో వ్యవహరించాలన్నారు. తమపట్ల వివక్షను ప్రదర్శించారనే ఫిర్యాదులు రాకుండా పక్కాగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలకు గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే విధంగా నగదు, మద్యం, ఇతర వస్తువుల పంపిణీపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించి క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా వాస్తవాలను నిర్ధారించి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. నిఘా బృందాల దృష్టిని మళ్లించేందుకు పలువురు చేసే తప్పుడు ఫిర్యాదుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, అలాంటి వాటిపై తగిన చర్యలు చేపట్టాలన్నారు. ఎన్నికల వ్యయం, ప్రచార సరళిపై నిఘా బృందాలు అనునిత్యం 24 గంటలు నిఘా ఉంచాలని, ఈ మేరకు పూర్తి స్థాయిలో బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. స్టాస్టిక్ సర్వైలెన్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ తదితర బృందాలకు సమకూర్చిన వాహనాలకు అత్యాధునిక సాంకేతికతతో కూడిన పీ.టీ.జీ కెమెరాలను ఏర్పాటు చేయిస్తున్నామని తెలిపారు. వీటి ద్వారా నిఘా బృందాల పనితీరును కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షించడం జరుగుతుందని, అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయంలోనూ లైవ్ ఫీడింగ్ పరిశీలన ఉంటుందన్నారు.

జిల్లా వ్యాప్తంగా 22 చెక్ పోస్ట్ ల వద్ద కూడా పీ.టీ.జీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని నిబంధనలకు అనుగుణంగా సమర్ధవంతంగా విధులు నిర్వహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ముఖ్యంగా తనిఖీల సమయంలో సాధారణ ప్రజలకు అనవసర ఇబ్బందులు ఏర్పడకుండా సంయమనంతో వ్యవహరించాలని, నగదును జప్తు చేసిన సందర్భాలలో తగు రీతిలో పంచనామా నిర్వహించి తప్పనిసరిగా రశీదులు అందించాలని ఆదేశించారు. అంతేకాకుండా తగిన ఆధారాలను చూపించి నగదును విడిపించుకునే వెసులుబాటు ఉంది అనే విషయాన్ని వివరించాలని, జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ కమిటీ గురించి తెలియజేయాలని సూచించారు. ఆయా పార్టీలు, అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన రేట్ కార్డును అనుసరిస్తూ లెక్కింపు చేయాలన్నారు. పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ మాట్లాడుతూ, ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరు అంకితభావంతో కృషి చేయాలని, ఎన్నికల నియమావళి తు.చ తప్పకుండా అమలయ్యేలా చూడాలన్నారు. ఎన్నికల వ్యయం, ప్రచార సరళి, ప్రలోభాల విషయంలో నిఘా బృందాలు క్రియాశీలక పాత్ర పోషించాలని సూచించారు. శిక్షణ తరగతుల్లో అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి, ఎన్నికల వ్యయం నోడల్ అధికారి పాపయ్య, ట్రెజరీ శాఖ ఉప సంచాలకులు కె.దశరథ్ తదితరులు పాల్గొన్నారు.

ఈవీఎం గోడౌన్ ను పరిశీలించిన కలెక్టర్

- Advertisement -

జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ లో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీల్ ను తెరిచారు. ఎన్నికల నిర్వహణ కోసం శాసనసభ నియోజకవర్గ కేంద్రాలకు రాండమైజేషన్ ద్వారా బ్యాలెట్ యూనిట్ లు, కంట్రోల్ యూనిట్లు, వీ.వీ.ప్యాట్లను ఇటీవలే తరలించిన విషయం విదితమే. తరలింపు పూర్తయిన మీదట ఇంకనూ ఈవీఎం గోడౌన్ లో మిగిలి ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను కలెక్టర్ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించి, నిబంధనలను అనుసరిస్తూ వాటిని భద్రపరిచేలా పర్యవేక్షణ చేశారు. సీ.యూ, బీ.యూ, వివి.ప్యాట్లకు సంబంధించిన వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకుని, సంబంధిత రిజిస్టర్లను పరిశీలించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement