జగిత్యాల ప్రతినిధి/మెట్‌పల్లి, (ప్రభన్యూస్): డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో గురువారం రైతు మహా పాదయాత్ర ప్రారంభమైంది. మల్లాపూర్ మండలం ముత్యంపేట నుండి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గంజ్ వరకు రైతు పాదయాత్ర కొనసాగ నుంది. పసుపు పంటను కేంద్ర మద్దతు ధరల జాబితాలో చేర్చి పదిహేనువేల రూపాయలు మద్దతు ధర ప్రకటించాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించి ఆదుకోవాలని, పసుపుబోర్డు ఏర్పాటు- చేయాలని, డబ్బా ట్రేడింగ్ నుండి పసుపు పంటలను తొలగించాలని రైతులు డిమాండ్ చేశారు. అదేవిధంగా మూసివేసిన షుగర్ ఫ్యాక్టరీలు తిరిగి పునరుద్ధరించాలని, వరి, మొక్కజొన్న పంటలను యధావిధిగా కొనుగోలు చేయాలని, రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయాలని, యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. రైతులు పండించిన ప్రతి పంటలకు ప్రభుత్వాలు గిట్టు-బాటు- ధరలు కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, పసుపు పంటలకు క్వింటాలకు రూ. 15 వేలు చెల్లించాలని, ఎర్ర జొన్నలను క్వింటాలుకు రూ.4,500 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
కాగా ముత్యంపేట లో ప్రారంభమైన రైతుల పాదయాత్ర వేంపేట గ్రామం మీదుగా మెట్ పల్లి, మేడిపల్లి, గండి హనుమాన్ నుంచి నిజామాబాద్ వరకు కొనసాగనుంది.రైతు పాదయాత్రకు భారీ బందోబస్తు….రైతు పాదయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జగిత్యాల జిల్లా ఎస్పీ సింధూ శర్మ ఆదేశాల మేరకు మెట్ పల్లి డీఎస్పీ రవీందర్ రెడ్డి నేతృత్వంలో సర్కిల్ పరిధిలోని పోలీసులు అవసరమైన బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతు ఐక్య వేదిక జగిత్యాల జిల్లా అధ్యక్షుడు పన్నాల తిరుపతి రెడ్డి, చెరుకు ఉత్పత్తి దారుల సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణ రెడ్డితో పాటు- జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన రైతులు, రైతు ప్రతినిధులు, ఆయా పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.