Sunday, November 24, 2024

నిర్మలమ్మా నిరుపేదలు కనిపడట్లేదా? ఉచిత రేష‌న్ అని చేతులు దులుపుకున్న‌ది గుర్తులేదా?: మంత్రి గంగుల‌

కామారెడ్డి జిల్లాలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రేషన్ బియ్యంపై చేసిన వాఖ్యలను తీవ్రంగా ఖండించారు మంత్రి గంగుల కమలాకర్. ఈ సంద‌ర్భంగా కేంద్ర మంత్రికి పలు ప్రశ్నలు సంధించారు. తెలంగాణలో 90.34 లక్షల కార్డులుంటే కేవలం 59శాతం కార్డులకు మాత్రమే అదీ ఒక్కరికి 5 కిలోలే కేంద్రం అందజేస్తున్న సత్యం నిర్మలా సీతారామన్ కు తెలియదా అని ప్రశ్నించారు. వీరికి 3రూపాయలకు మీరిస్తుంటే రెండ్రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందన్నారు. అదనపు కిలోకు 33 రూపాయలు వెచ్చించి సాలీనా 372 కోట్ల రూపాయ‌లు భరించి ప్రజలకు కేవలం 1 రూపాయకే బియ్యం ఇస్తున్న ప్ర‌భుత్వం కేసీఆర్‌దేన‌న్నారు.

కేంద్రం పట్టించుకోని అకలితో అలమటిస్తున్న 95 లక్షల మందికి ప్రతీ కిలోపై 33 రూపాయలు వెచ్చించి ఎలాంటి పరిమితులు లేకుండా ఇంట్లోని ప్రతీ వ్యక్తికి ఆరు కిలోలు అందజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కడుపునిండా అన్నం పెడుతుందన్నారు. ఇందుకు నెలకు 300 కోట్లకు పైగా ఆర్థిక భారాన్ని భరిస్తూ సంవత్సరానికి 3,610 కోట్లను కేసీఆర్ కేటాయించి దాదాపు 8 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇచ్చే వాస్తవాన్ని ఒప్పుకోవడానికి కేంద్ర పెద్దలకు అభ్యంతరమేంటని ప్రశ్నించారు.

కరోనా సంక్షోభంలో ఐదు కిలోలు ఉచిత రేషన్ అని చేతులు దులుపుకున్నకేంద్రం ఎక్కడా? అని మంత్రి గంగుల ప్ర‌శ్నించారు. అదనంగా 3863 కోట్లు ఖర్చుచేసి రెండు నెలలు 15 వందల రూపాయలు, మైగ్రేంట్ లేబర్లకు 5 వందలు, ప్రతీ కార్డుకు కందిపప్పు, చిరుద్యోగులకు 3 నెలలు 25కిలోల సన్నబియ్యంతో పాటు, రాష్ట్రంలోని ప్రతీ కార్డుదారునికి మూడువిడతలా 25నెలల పాటు కేంద్రం ఇచ్చే ఐదు కిలోలకు తోడు రెగ్యులర్ బియ్యం ఐదుకిలోలు సైతం అందించిన తెలంగాణ ప్రభుత్వంతో కనీసం సరితూగగలరా? అని ప్రశ్నించారు మంత్రి గంగుల కమలాకర్.

కలెక్టర్ జిల్లా కార్యనిర్వాహణాధికారి అనే విషయం మరిచి కేవలం ఒక శాఖ కోసం మాత్రమే పనిచేయడు అనే కనీస అవగాహన లేకుండా కలెక్టర్‌తో పాటు జిల్లా అధికారులపై కేంద్ర మంత్రి హోదాలో కనీస మర్యాద పాటించకపోవడం అన్యాయమని ఇది ఉద్యోగుల మ‌నో స్థైర్యాన్ని దెబ్బతీయడమే అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement