నిర్మల్ ప్రతినిధి, జనవరి 25 (ఆంధ్రప్రభ) : నిర్మల్ పట్టణ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిర్మల్ పురపాలక సంఘ కార్యాలయంలో శనివారం జరిగిన పాలకవర్గ సర్వసభ్య సమావేశంలో పాల్గొని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు. నిర్మల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన పురపాలక సంఘ సర్వ సభ్య సమావేశం నిర్మల్ పట్టణ అభివృద్ధిపై పలు తీర్మానాలు చేశారు.
పార్టీలకతీతంగా నిర్మల్ పట్టణ అభివృద్ధికి అందరూ కృషి చేయాలని ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చైర్మన్, కౌన్సిలర్లు ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సమావేశంలో ప్రవేశపెట్టిన పలు ఎజెండాలపై చర్చించారు. ముఖ్యంగా నిర్మల్ పట్టణ మాస్టర్ ప్లాన్ తో పాటు తదితర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, గండ్రత్ ఈశ్వర్, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.