నిర్మల్ ప్రతినిధి.. ప్రభా న్యూస్ : ఎంతో మంది ఉద్యమకారుల త్యాగ ఫలితాలతో ఏర్పడిన స్వరాష్టం సిద్ధించడంతోనే.. దేశంలో ఎక్కలేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎంతో మంది త్యాగ ధనుల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు వారి త్యాగాలను ఎప్పుడు కూడా స్మరించుకుంటారన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ముచ్చటగా మూడోసారి బిఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తేస్తేనే సంక్షేమ పథకాలు పొందవచ్చునని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. రేపు నిర్మల్ లో జరిగే సీఎం బహిరంగ సభకు భారీ ఎత్తున ప్రజలు తరలి రావాలని మంత్రి పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లాలో 21 రోజులపాటు.. గ్రామీణ ప్రాంతo మొదలుకొని పట్టణ ప్రాంతాల్లో సైతం కనుల పండుగగా దశాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని జిల్లా అధికారులకు మంత్రి సూచించారు.