ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో, ఆంధ్రప్రభ : సరదాగా గాలిపటం ఎగరేస్తూ ప్రమాదవశాత్తు భవంతి పై నుండి కిందపడి బాలుడు మృతి చెందిన సంఘటన ఆ కుటుంబంలో విషాదం నింపింది. బుధవారం నిర్మల్ పట్టణంలోని గుల్జర్ మార్కెట్ కాలనీలో నలుగురు స్నేహితులు కలిసి గాలిపటాలు ఎగురవేస్తుండగా ఉజీబ్ (14) అనే బాలుడు ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కిందపడి మృతి చెందాడు.
స్థానికుల కథనం ప్రకారం పట్టణంలోని గుల్జర్ మార్కెట్ కు చెందిన మహమ్మద్ ఉజీబ్ అనే బాలుడు బుధవారం పాత కూరగాయల మార్కెట్ సమీపంలో భవనంపై ఎక్కి స్నేహితులతో కలిసి గాలిపటాలు ఎగురవేస్తున్నాడు. ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న అదనపు ఎస్పీ రాజేష్ మీనా, పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ ఆస్పత్రికి వెళ్లి ఘటనకు సంబంధించి వివరాలు తెలుసుకున్నారు.