హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఎగువన కర్ణాటకలోని అలమట్టి, నారాయణపూర్, తుంగభద్ర నుంచి వరద స్థిరంగా కొనసాగుతుండడంతో శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. వారం రోజులుగా వస్తున్న వరదతో జలాశయం నిండుకుండలా మారుతోంది. అలమట్టి నుంచి 1, 50, 000, నారాయణపూర్ నుంచి 1, 60,000 క్యూసెక్కులు, జూరాల నుంచి 1, 65, 000 క్యూసెక్కులు, జూరాల, సుంకేసుల నుంచి 3లక్షల 3వేల 779 క్యూసెక్కుల వరద శ్రీశైలానికి వస్తోంది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా… ప్రస్తుత నీటి మట్టం 859.60 అడుగులగా ఉంది. శ్రీశైలం పూర్తి సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా… ప్రస్తుతం నీటి నిల్వ 108.6785 టీఎంసీలకు చేరింది. నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు శ్రీశైలం నుంచి నీటి విడుదల కొనసాగుతుండడంతో 16, 848 క్యూసెక్కుల వరద కొనసాగుతోంది.
ప్రారంభమైన విద్యుదుత్పత్తి
వరద పోటెత్తుతుండడంతో శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. విద్యుదుత్పత్తి కోసం శ్రీశైలం నుంచి 31784 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. శాంతిస్తున్న గోదావరి… ఒక్కొక్కటిగా సేఫ్‌జోన్‌లోకి ప్రాజెక్టులు వారం రోజులుగా మహోగ్రంగా ప్రవహిస్తున్న గోదావరి శాంతించింది. ఎగువ నుంచి వరద పోటు తగ్గడంతో గోదావరిపై ఉన్న ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా సేఫ్ జోన్‌లోకి వెళుతున్నాయి. నిజాంసాగర్‌కు వరద తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం 980 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. వరద తగ్గుముఖం పట్టడంతొ గేట్లను మూసివేసి దిగువకు నీటి విడుదలను అధికారులు ఆపారు. మరోవైపు శ్రీరాంసాగర్‌కు వరద తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం 1640 క్యూసెక్కుల వరద వస్తుండడంతో… గేట్లను అధికారులు మూసివేశారు. ప్రస్తుతం శ్రీరాంసాగర్‌లో 77.06 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కడెం ప్రాజెక్టు గేట్లను అధికారులు ఎట్టకేలకు మూసివేశారు. ప్రస్తుతం కడెం ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఎలాంటి వరద ప్రవాహం లేకపోగా… దిగువకు 5002 క్యూసెక్కుల నీరు మాత్రమే వెళుతోంది. ప్రస్తుతం రిజర్వాయర్‌లో పూర్తిసామర్థ్యం 7.60 టీఎంసీలకుగాను 3.33 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 71 వేల క్యూసెక్కులుగా ఉండగా… ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతోంది దీంతో అధికారులు 7 గేట్లను ఎత్తి 64వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా… ప్రస్తుతం 16.9679 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
మేడిగడ్డ వద్ద కొనసాగుతున్న వరద ఉధృతి…
మరోవైపు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. మేడిగడ్డ బ్యారేజ్ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 10, 45, 520 క్యూసెక్కులుగా ఉందని అధికారులు చెబుతున్నారు. బ్యారేజీ వద్ద మొత్తం 85గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సరస్వతి బ్యారేజ్‌ీలోని మొత్తం 66 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. సరస్వతి బ్యారేజీకి ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లో 39, 386 క్యూసెక్కులు నమోదవుతోంది.
దెవాదుల పైప్‌లైన్ లీక్… పంట పొలాలను ముంచెత్తిన వరద…
హనుమకొండ జిల్లా దామెర మండలం పులుకుర్తి సమీపంలో దేవాదుల పైప్‌లైన్ లీకైంది. దీంతో నీరు ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఉదయం లీకైన నీరు… మధ్యాహ్నానానికి గానిఅదుపులోకి రాలేదు. చలివాగు ప్రాజెక్టు నుంచి భీమ్ ఘన్‌పూర్‌కు వెళ్లే మార్గంలో ఈ పైప్‌లైన్ లీకేజీ జరిగింది. విషయం తెలుసుకున్న అధికారులు చలివాగు వద్ద మోటార్లను ఆపేశారు. లీక్ అయిన పైప్‌లైన్ వద్ద నీరు పూర్తిగా నిలిచిపోయేందుకు మధ్యాహ్నం వరకు పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పైప్‌లైన్ లీకేజీతో సమీపంలోని పంట పొలాలు నీట మునిగాయి. మొన్నటి వరకు వర్షాలు, ఇప్పుడు దేవాదుల లీకేజీతో వరినారు దెబ్బతిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.