Home తెలంగాణ‌ HYD| కొత్త సంవ‌త్స‌రం వేడుక‌లు.. న‌గ‌రంలో పోలీసుల క‌ఠిన ఆంక్ష‌లు

HYD| కొత్త సంవ‌త్స‌రం వేడుక‌లు.. న‌గ‌రంలో పోలీసుల క‌ఠిన ఆంక్ష‌లు

0
HYD| కొత్త సంవ‌త్స‌రం వేడుక‌లు.. న‌గ‌రంలో పోలీసుల క‌ఠిన ఆంక్ష‌లు

హైద‌రాబాద్ – ఇంకొద్ది రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాం. న్యూ ఇయర్‌కు గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పడానికి ఇప్పటి నుంచే హైదరాబాద్ ముస్తాబవుతోంది. వేడుకల కోసం సిద్ధమౌతోంది. ఇప్పటికే ఈ దిశగా ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలు ఆఫర్లను సైతం ప్రకటించాయి కూడా. ఈ పరిస్థితుల మధ్య హైదరాబాద్ నగర పోలీసులు కఠిన ఆంక్షలను అమలులోకి తీసుకుని రానున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, ఉద్రిక్త పరిస్థితులకు తావు ఇవ్వకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టనున్నారు. మాదక ద్రవ్యాలు, విచ్చలవిడిగా మద్యం సేవించడాన్ని అరికట్టే దిశగా అడుగులు వేయనున్నారు.

దీనికి సంబంధించిన వివరాలను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. పబ్బులు, స్టార్ హోటళ్లు, బార్లపై నిఘా ఉంచుతామని అన్నారు. కొత్త ఏడాది వేడుకల పేరుతో నిబంధనలను అతిక్రమిస్తే ఏ మాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తే ఉండబోదని తేల్చిచెప్పారు. నగర వ్యాప్తంగా షీ టీమ్స్‌ అందుబాటులో ఉంటాయని సీవీ ఆనంద్ తెలిపారు. ప్రత్యేక నిఘా మహిళలు, యువతులు, చిన్న పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించితే భారత్ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని అన్నారు. న్యూఇయర్ సెలబ్రేషన్స్ పేరుతో అశ్లీల, అసభ్యకర నృత్యాలకు పాల్పడకూడదని, వాటిని నిషేధించామని సీవీ ఆనంద్ చెప్పారు. అవుట్‌ డోర్‌లో రాత్రి 10 గంటల తరువాత లౌడ్ స్పీకర్ల వినియోగంపైనా నిషేధం ఉంటుందని పేర్కొన్నారు. పబ్‌లు, బార్లలో మైనర్లకు అనుమతి లేదని, డ్రంక్ అండ్ డ్రైవ్‌ చేస్తే 10,000 రూపాయల జరిమానాతో పాటు ఆరు నెలల పాటు జైలు శిక్షను ఎదుర్కొనాల్సి ఉంటుందని చెప్పారు.

బంధు మిత్రులు కొత్త ఏడాది వేడుకలను నిర్వహించాలనుకుంటే పోలీసుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని సీవీ ఆనంద్ పేర్కొన్నారు. దీనికోసం 15 రోజుల ముందే దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. వేడుకలను నిర్వహించదలిచిన ప్రదేశంలో సీసీ కెమెరాలు తప్పనిసరి అని అన్నారు. రాత్రి ఒంటిగంట వరకు ఇండోర్ వేడుకలను నిర్వహించుకోవచ్చని, శబ్దం 45 డెసిబల్స్‌కు మించకూడదని చెప్పారు. నగరవ్యాప్తంగా ఉన్న 3- స్టార్‌, 5- స్టార్‌ హోటళ్ల యజమానులు విధిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాల్సిందేనని, దీనికి సంబంధించిన ఫుటేజీని భద్రపర్చాల్సి ఉంటుందని సీవీ ఆనంద్ అన్నారు. మద్యం సేవించిన వాళ్లు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా నిరోధించాల్సిన బాధ్యత న్యూఇయర్ ఈవెంట్ల నిర్వాహకులదేనని, వారి కోసం సొంత వాహనాలు లేదా క్యాబ్‌లను అందుబాటులో ఉంచాలని చెప్పారు.

Exit mobile version