ప్రభుత్వ అంచనా ప్రకారం కొత్తగా 10 లక్షల రేషన్ కార్డులు
రేషన్ కార్డుల మంజూరీలో కులగణన సర్వే ఆధారం
కొత్త తెల్ల రేషన్ కార్డులతో రూ. 956 కోట్లు అదనపు భారం
రేషన్ కార్డులకు 18 లక్షల దరఖాస్తులు
శాసనమండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్ – సంక్రాంతి తరువాత కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరీ ప్రక్రియను మొదలు పెట్టబోతున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర శాసనమండలిలో ఇవాళ జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో కోదండరెడ్డి, మీర్జా రియాజుల్ హసన్ ఏఫెండి లతో పాటు జీవన్ రెడ్డి, సత్యవతి రాథోడ్ తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఉత్తమ్ సమాధానమిస్తూ ప్రభుత్వ అంచనా ప్రకారం కొత్తగా పది లక్షల కొత్త రేషన్ కార్డుల మంజూరు ఉండ వచ్చని సూచన ప్రాయంగా సభకు వివరించారు.తద్వారా 31 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని ఆయన చెప్పారు.
కొత్త రేషన్ కార్డుల మంజూరికి తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేను కుడా ఆధారం చేసుకుంటామన్నారు.
కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరీతో రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా 956 కోట్ల భారం పడుతుందన్నారు.ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులు జారీ చెయ్యబోతున్నట్లు ఆయన వెల్లడించారు.
ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులలో అదనపు పేర్ల నమోదుకు గాను మీ సేవ కేంద్రం ద్వారా గడిచిన పదేళ్లుగా వచ్చిన 18 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ ఉపసంఘం నియమించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
తనను చైర్మన్ గా సహచర మంత్రులు దామోదరం రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లు సభ్యులుగా ఉన్న ఈ ఉప సంఘం పలుమార్లు సమావేశమై సిఫారసులను క్యాబినెట్ ఆమోదం కోసం పంపించినట్లు ఆయన తెలిపారు. తెల్ల రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియలో సుప్రీంకోర్టు కు సక్షేనా కమిటీ సమర్పించిన సిఫారసులను పరిగణనలోకి తీసుకున్నట్లు ఆయన చెప్పారు.
అంతే గాకుండా రాష్ట్రంలోని శాసనసభ్యులు,శాసనమండలి సభ్యులు,లోకసభ,రాజ్యసభ సభ్యుల నుండి సేకరించిన సూచనలను కుడా మంత్రివర్గ ఉప సంఘం పరిగణనలోకి తీసుకున్నట్లు ఆయన చెప్పారు. వీటన్నింటినీ అధ్యయనం చేసిన ఉపసంఘం కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరికి అర్హతా ప్రమాణాలు నిర్ణయిస్తూ చేసిన సిఫారసులు రాష్ట్ర క్యాబినెట్ ముందుంచినట్లు ఆయన తెలిపారు.
కొత్త చౌక ధరల దుకాణాలకు అనుమతి …
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న చౌక ధరల దుకాణాల డీలర్ల భర్తీ ప్రక్రియను చేబడతామన్నారు. అంతే గాకుండా కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీలతో పాటు తండా లలో కుడా కొత్త చౌక ధరల దుకాణాల ఏర్పాటు ఉంటుందన్నారు. చౌక ధరల దుకాణాల ద్వారా ఇప్పటి వరకు పంపిణీ చేస్తున్న దొడ్డు రకం బియ్యాన్ని ప్రజలెవ్వరు వినియోగించక పోవడంతో దారి మళ్లు తున్న వాస్తవాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందన్నారు. అందుకనే తెల్ల రేషన్ కార్డు దారులందరికి ఇకపై సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.
నిత్యావసర వస్తువులు ఇవ్వలేం ..
చౌక ధరల దుకాణాల ద్వారా ఇతర నిత్యావసర వస్తువుల పంపిణీ ఆలోచన ఇప్పటి వరకైతే లేదని, ఏదన్నా ఉంటే క్యాబినెట్ ముందు పెట్టి సమిష్టిగా నిర్ణయం తీసుకుంటామన్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణా ప్రాంతంలో 91 లక్షల 68 వేల 231 రేషన్ కార్డులు ఉండేవన్నారు. మొత్తం లబ్ధిదారుల సంఖ్య 3.38 కోట్లని ఆయన సభకు వివరించారు. అయితే తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఇక్కడి నుండి ఆంద్రప్రదేశ్ కు చెందిన వారు తమ తమ ప్రాంతాలకు తిరిగి వెళ్లడంతో 2 లక్షల 46 వేల 324 రేషన్ కార్డులు రద్దు అయినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా తెలంగాణా ఏర్పడ్డాక 2.7 కోట్ల లబ్ధిదారులకు గాను మొత్తం 89 లక్షల 21 వేల 907 తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయన్నారు.
కొత్తగా ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రం సిరీస్ కు కొత్త ఆహారభద్రత కార్డులు అనుసంధానం చేశామన్నారు. అదనంగా 2016 నుండి 2023 వరకు కొత్తగా 20 లక్షల 69 వేల మంది లబ్ధిదారులకు 6,47,479 ఆహార భద్రతా కార్డులు మంజూరు చేశారన్నారు.
అదే 2016 నుండి 2023 వరకు 19 లక్షల మంది లబ్ధిదారులను అనర్హులుగా గుర్తించి 5,98,000 ఆహార భద్రత కార్డులు తొలగించారన్నారు. అంటే తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక గడిచిన పదేళ్ళ వ్యవధిలో అంటే 2014 నుండి 2023 వరకు 86 వేల మంది లబ్ధిదారులకు మంజూరు చేసిన తెల్ల రేషన్ కార్డుల జారీ చేసింది 49 వేలు మాత్రమేనన్నారు.
ప్రస్తుతం ఈ రోజున రాష్ట్రంలో మొత్తం 89.95 లక్షల తెల్ల రేషన్ కార్డులతో 2.81 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అదేవిధంగా జాతీయ ఆహారభద్రత కింద కేంద్రప్రభుత్వం 54 లక్షల కార్డులు అందించగా కోటి 91 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న 35 లక్షల ఆహార భద్రతా కార్డులతో 89 లక్షల మంది ప్రయోజనం పొందుతున్నారని ఆయన సభకు వివరించారు.