Monday, November 25, 2024

TS : ఖ‌మ్మం కారు ప్ర‌మాదంలో కొత్త ట్విస్ట్ …

ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం హరియాతండాలో సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో స‌రికొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది…ఇది ప‌క్కా ప్లాన్ ప్ర‌కారం చేసిన హ‌త్య‌లేనంటూ బంధువులు ఆరోపిస్తున్నారు….వివ‌రాల‌లోకి వెళితే బాబోజితండాకు చెందిన డా.బోడా ప్రవీణ్, తన భార్య కుమారి(25), కుమార్తెలు కృషిక (4), తనిష్క(3)తో కలిసి కారులో మంగళవారం రాత్రి మంచుకొండ నుంచి హర్యాతండాకు బయలుదేరారు.

- Advertisement -

గ్రామం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే కారు ప్రమాదానికి గురైంది. అకస్మాత్తుగా అడ్డు వచ్చిన కుక్కను తప్పించబోయి కారు రహదారి పక్కకు దూసుకెళ్లి చెట్టును ఢీకొంది. అనంతరం రహదారిపై వెళ్తున్నవారు కారులోని వారిని బయటకు తీశారు. అప్పటికే , కృషిక , క్రితన్య మృతి చెందారు. అపస్మారక స్థితిలో ఉన్న కుమారిని 108 అంబులెన్సు సిబ్బంది ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

కుమారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనలో ప్రవీణ్‌కు స్వల్ప గాయాలవ్వడంతో అతన్ని బంధువులు ఆటోలో మరో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంపై కుమారి కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

పక్క ప్లాన్ ప్రకారమే హత్య?
భర్త ప్రవీణే చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి శవాగారంలో తల్లి, పిల్లల మృతదేహాలను భద్రపరిచారు. శవపరీక్ష నివేదిక వచ్చాకే ప్రమాదమా? హత్యా? అనేది తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ మృతురాలు కుమారి కుటుంబ సభ్యులు బుధవారం నాడు ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. భార్య, పిల్లల్ని ప్రవీణే హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడని వారు ఆరోపిస్తున్నారు.

అతడిని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. అంత పెద్ద యాక్సిడెంట్ జరిగితే కుమారి, ఆమె పిల్లలకు ఎలాంటి గాయాలు కాలేదని.. ఎటువంటి గాయాలు లేకుండా వీరు ముగ్గురు ఎలా చనిపోయారని ప్రశ్నించారు. వేరే మహిళతోని వివాహేతర సంబంధం పెట్టుకొని పక్క ప్లాన్ ప్రకారమే మా అక్కను, పిల్లల్ని మా బావనే చంపేశాడని కుమారి సోదరి ఆరోపించారు.

వివాహేతర సంబంధమే కారణమా?

ప్రవీణ్‌ హైదరాబాద్‌లో ఫిజియోథెరపిస్ట్‌గా పనిచేస్తున్నారు. 2017లో ఏన్కూరు మండలం రంగాపురానికి చెందిన హరిసింగ్, పద్మ దంపతుల కుమార్తె కుమారితో వివాహమైంది. వివాహం సందర్భంగా రూ.24 లక్షలు వరకట్నంగా ఇచ్చామని ఆమె తండ్రి హరిసింగ్‌ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. వారికి ఇద్దరు కుమార్తెలేనని, కుమారుడు పుట్టలేదని ప్రవీణ్‌ అసంతృప్తితో ఉన్నారు. ఈక్రమంలో కేరళకు చెందిన యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. దీనిపై ఏడాదిగా దంపతుల మధ్య వివాదం నడుస్తోంది.

ఇటీవల ఆ యువతితో కేరళ వెళ్లిన ప్రవీణ్‌ 20 రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చారు. పది రోజుల క్రితం కుమారి, తన పిల్లలతో హైదరాబాద్‌ నుంచి బాబోజితండాకు వచ్చారు. 25న వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా కేక్‌ తెమ్మన్నా ప్రవీణ్‌ తేలేదని హరిసింగ్‌ తెలిపారు. ఈ క్రమంలో వారు చనిపోవడం, కుమారి, పిల్లల శరీరంపై ఒక్క గాయం కూడా లేకపోవడంపై తల్లిదండ్రులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన వారిని అంబులెన్సులో తీసుకువస్తుంటే అతన్ని ఎందుకు వేరే వాహనంలో తరలించారని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement