అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ తరహాలో సికింద్రాబాద్ కొత్త రైల్వే స్టేషన్ రూపుదిద్దుకుంటోందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ది పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు.
ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అభివృద్ది పనులు చేస్తున్నారని చెప్పారు. 700 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ది పనులు జరుగుతున్నాయని తెలిపారు. 2025 నవంబర్ కల్లా పనులు పూర్తి అవుతాయని వెల్లడించారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయని, అది కూడా త్వరలోనే పూర్తి అవుతుందన్నారు. చర్లపల్లి టెర్మినల్ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానిస్తామని తెలిపారు.
రీజినల్ రింగ్ పూర్తయితే ఆ ప్రాంతాల దగ్గర కొత్త రైల్వే స్టేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇక్కడ 22 లిఫ్టులు 30కి పైగా ఎస్కలేటర్లు అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రయాణికులు నేరుగా స్టేషన్ లోకి రావడానికి, బయటికి వెళ్ళడానికి గగనతలం నుంచే ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మాణం జరుగుతుందని కిషన్ రెడ్డి తెలిపారు.