హైదరాబాద్, ఆంధ్రప్రభ: సరికొత్త పాలన సౌధం నూతన సచివాలయంలోకి ప్రభుత్వ శాఖల తరలింపు ప్రక్రియ ప్రారంభమవుతున్నది. ఈ నెల 30న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ప్రారంభానికి నోచుకుంటున్న నేపథ్యంలో నాలుగు రోజుల్లో శాఖలన్నింటినీ తరలించే ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. పనులన్నీ పూర్తి చేసుకొని సర్వాంగ సుందరంగా ప్రారంభానికి సిద్ధమైన సచివాలయంలోకి ప్రభుత్వ శాఖలు ఫైళ్లు, సరంజామాతో తరలేందుకు రెడీ అవుతున్నాయి. వీలైతే నేడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి ఏ శాఖ ఏ రోజు తరలించాలనే షెడ్యూల్‌ను ఇవ్వనుందని తెలిసింది. 30లోగా షిఫ్టింగ్ పనులను పూర్తిచేసి ప్రారంభోత్సవంలోగా శాఖల వారీగా పాలనను ప్రారంభించేలా సిద్ధంగా ఉండాలని ప్రతీ శాఖకు ఆదేశాలు అందినట్లు తెలిసింది. తొలుత బీఆర్కే భవన్‌లోని శాఖలను ఫ్లోర్ వారీగా నూతన సచివాలయానికి తరలించనున్నారు. ఇప్పటికే నూతన సచివాలయంలో ఏ ఫ్లోర్లో ఏ మంత్రి ఉండాలి… అదే ఫ్లోర్లో అదే శాఖకు చెందిన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, అసిస్టెంట్ సెక్రటరీలు, అదనపు కార్యదర్శులు, సెక్షన్లు ఉండేలా డిజైన్లు చేయగా, తుది నిర్ణయం సీఎం కేసీఆర్ ఖరారు చేయనున్నారు. మంత్రుల క్యాబిన్టు, ఏ అధికారికి ఏ దిక్కులో క్యాబిన్లు ఉండాలి.. అనే సమగ్ర అంశాలను సీఎం కేసీఆర్ ఫైనల్ నిర్ణయంతో తుది రూపం తేనున్నారు.
సాధారణ పరిపాలనా శాఖ మొదటి అంతస్తులో, రెండో అంతస్తులో ఆర్థిక శాఖ, మూడో ఫ్లోర్లో రెవెన్యూ, నాల్గో అంతస్తులో పంచాయతీరాజ్, 5వ అంతస్తులో ఇరిగేషన్ వంటి శాఖలతోపాటు ప్రతి ఫ్లోర్లో మరో శాఖకు ఎడమ,
కుడి వైపులా కేటాయింపులు చేయనున్నారు. బీఆర్కే భవన్‌లోని ఫర్నీచర్‌ను కాకుండా, కేవలం ఫైళ్లు, కంప్యూటర్లను మాత్రమే తరలించనున్నారు. ఇప్పటికే కీలక సమాచారాన్ని, ఫైళ్లను, అవసరమైన డేటాను పెన్‌డ్రైవ్‌లలో కాపీ చేసి పెట్టుకోవాలని అన్ని శాఖలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నెల 30 నుంచి 32 ప్రభుత్వ శాఖలకు నూతన సచివాలయంలో ఏకకాలంలో పాలనను ప్రారంభించేలా సర్వం సిద్ధం చేస్తున్నారు.
సచివాలయంలోని అన్ని అంతస్తులలో ఫర్నీచర్ పనులు పూర్తి దశకు చేరుకున్నాయి. ఆరో అంతస్తు మొత్తం సీఎం కార్యాలయానికి కేటాయించగా, ప్రస్తుతం ఫర్నీచర్, నెట్వర్కింగ్ పనులు జోరుగా సాగుతున్నాయి. అదే ఫ్లోర్లో క్యాబినెట్ సమావేశ మందిరం, సీఎస్ కార్యాలయం ఉండనుంది.
సచివాలయంలోని అన్ని ఫ్లోర్లలో పూర్తిగా ఆధునిక, సౌకర్యవంతమైన నూతన ఫర్నీచర్‌ను మాత్రమే రెడీ చేస్తున్నారు. మ్యాన్యువల్ ఫైళ్లు, కంప్యూటర్ల తరలింపుకు ప్రత్యేకంగా ఒక ఏజెన్సీకి బాధ్యతలను అప్పగించారు. జీఏడీ ఆదేశాల మేరకు బీఆర్కే భవన్‌నుంచి దస్త్రాలు, కంప్యూటర్ల తరలింపు ప్రారంభం కానున్నది. ఇంకా ఇతర భవనాల్లో కొనసాగుతున్న మంత్రుల కార్యాలయాలను కూడా తరలించనున్నారు. మెట్రో రైల్ భవన్లో ఉన్న సీఎం కార్యాలయం, సీఎం కార్యదర్శుల కంప్యూటర్లు, ఫైళ్లను కూడా యుద్ధ ప్రాతిపదికన తరలించనున్నారు. ఇప్పటికే సచివాలయ భద్రతకు ప్రాధాన్యతనిచ్చిన ప్రభుత్వం పహారాకు సాయుధ పోలీసుల వినియోగంతోపాటు స్పెషల్ పోలీసులను నియమించనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఉన్న ఎస్పీఎఫ్ భద్రతా బాధ్యతలను ఉపసంహరించి వారి స్థానంలో స్పెషల్ పోలీసుల వినియోగానికి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఎటువంటి ఇంటర్నెట్, ఇతరత్రా నెట్వర్కింగ్ సమస్యలు లేకుండా పూర్తిస్థాయి ఆధునిక పద్దతులతో పనులను యుద్దప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు.