హైదరాబాద్ – రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన ‘డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం’ ప్రారంభానికి సిద్ధమయ్యింది. నూతన సచివాలయ భవనాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నేడు ప్రారంభించనున్నారు. అత్యాధునిక వసతులతో నిర్మించిన రాష్ట్ర పరిపాలనా సౌధాన్ని మధ్యాహ్నం ఒంటి గంట 20 నిమిషాలకు సీఎం ప్రారంభిస్తారు. సచివాలయ ప్రధాన ద్వారాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనుండగా, అదే సమయానికి మంత్రులంతా ఎవరికివారు తమతమ కార్యాలయాలను ప్రారంభించుకొని కొలువుదీరుతారు. అధికారులు కూడా తమతమ శాఖల కార్యాలయాల్లో ఆసీనులవుతారు.
చండీయోగం ప్రారంభం…
సచివాలయాన్ని ప్రారంభిస్తున్న సమయంలో అన్నిరకాల సంప్రదాయాలతో పూజలు నిర్వహించనున్నారు. ప్రార్థనలు కూడా జరుపనున్నారు. ఆదివారం ఉదయం 5 గంటల 50 నిమిషాల నుంచి రుత్విక్కులు పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 6.15 నిమిషాలకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి దంపతులు చండీయాగం, సుదర్శన యాగాల్లో పాల్గొంటున్నారు. అనంతరం అక్కడే జరిగే వాస్తు పూజలో కూడా మంత్రి ప్రశాంత్‌రెడ్డి దంపతులు పాల్గొంటారు. హోమం, యాగ నిర్వహణ, సచివాలయంలో వివిధ చాంబర్ల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో 110 మంది వేదపండితులు, రుత్విక్కులు పాల్గొంటారు. శృంగేరీ పీఠానికి చెందిన గోపీకృష్ణ శర్మ, ఫణిశశాంక శర్మ, వాస్తు పండితుడు సుద్దాల సుధాకర తేజ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.